AP is Neglecting the implementation of Jal Jeevan Mission: 'జల్‌జీవన్ మిషన్ పథకం కోసం నిధులిచ్చాం.. 2021-22 తర్వాత ఒక్క పైసా కూడా వినియోగించుకోలేకపోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది చాలా విచారకరం' అంటూ రాజ్యసభ సాక్షిగా జులై 24న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 చివరి నాటికి నూరు శాతం లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ 55 లీటర్ల సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని కేంద్రం ఈ జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో 26 వేల 309 కోట్ల అంచనా వ్యయంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటా భరించేలా నిర్ణయించారు. కేంద్రం నిధులిచ్చినా వైసీపీ ప్రభుత్వం మాత్రం తన వంతు వాటా ఇవ్వడం లేదు. కనీసం కేంద్ర నిధులనైనా ఖర్చు చేసిందా అంటే అది లేదు. ఈ పథకం అమలులో జాతీయ స్థాయిలో అట్టడుగున నిలిచి రాష్ట్ర పరువును జగన్ సర్కార్ గంగలో కలిపోసింది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఏటా వేసవి వచ్చిందంటే మైళ్ల దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్న దుస్థితి మారుమూల ప్రాంతాల్లోని ప్రజలది. కలుషిత నీరు తాగి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నా.. సీఎం జగన్‌ని మాత్రం కదిలించలేకపోయాయి. ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ పథకాన్ని వినియోగించుకోలేని అసమర్ధత కారణంగా.. తామంతా దప్పికతో అల్లాడిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.
జలజీవన్ మిషన్‌లో భాగంగా 2019-20లో 26వేల 309 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు మొదల్యయ్యాయి. దీనిలో భాగంగా కేంద్రం 2019-20లో 372.64 కోట్లను ఇచ్చింది. 2020-21 సంవత్సరానికి గాను మరో 790.48 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఐతే జగన్ సర్కారు సకాలంలో ఖర్చు చేయకపోవటం, రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం కేవలం 297.62 కోట్లనే విడుదల చేసింది.
ఇక 2021-22లో కేంద్రం 3వేల 812.88 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతగా 791.06 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో 40 కోట్లను మాత్రమే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో జత చేసింది. దీంతో 2021-22 సంవత్సారానికి కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం రాకుండా పోయింది. మొత్తం మీద 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన 3వేల 514.68 కోట్లను రాష్ట్రం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
జలజీవన్ మిషన్‌లో భాగంగా 8వేల 395 కోట్లతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టుల్లో ఇంతవరకు కదలిక లేదు. పనులెప్పుడు ప్రారంభంమవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే సర్వేలతో కాలయాపన చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక పైపులైన్ల ద్వారా గ్రామాల్లోని రక్షిత తాగునీటి పథకాలకు నీరివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 36.21 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా.. వీటిని గ్రామాల్లో ఇప్పటికే ఉన్న రక్షిత తాగునీటి పథకాలకు అనుసంధానిస్తున్నారు. దీంతో ఆ నీరు సరిపోక అత్యధిక ప్రాంతాల్లో కుళాయిలు అలంకారప్రాయంగానే మిగిలాపోయాయి. ఉమ్మడి ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.
జలజీవన్ మిషన్ పథకం అమలులో ఏపీతో పోల్చుకుంటే చిన్న రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. కేంద్రంతో సమానంగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల గొంతు తడపగలుగుతున్నాయి. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లోని వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా కేంద్రం గుర్తించి జల్‌జీవన్ అవార్డు-2022 కింద ప్రథమ బహుమతిని అందజేసింది.
గ్రామాల్లోని మొత్తం 53.98 లక్షల ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం కుళాయి కనెక్షన్లు ఇచ్చింది. తెలంగాణతో పోల్చి చూసుకుంటే జల్‌జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం అధోగతిలో ఉంది. రాష్ట్రంలోని గ్రామాల్లో 95లక్షల 54వేల 840 ఇళ్లు ఉండగా.. జేజేఎం ప్రారంభమైన నాటికి 30.74 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం మొదలయ్యాక ఇప్పటివరకు 36.21 లక్షల ఇళ్లకు కొత్తగా కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 30 శాతం అంటే 28.5 లక్షల ఇళ్లకు ఎప్పుడిస్తారో ఆ దేవుడికే తెలియాలి.
అనవసర విషయాల్లో గొంతెత్తి గోల చేసే మంత్రులు.. అవసరమైన అంశాల్లో ఎందుకు నోరు మెదపలేకపోతున్నారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రజలకు మంచి చేసే జల్‌జీవన్ పథకంపై ఇకనైనా దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.