High Court Hearing APGEA Petition : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడంపై ఏపీ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఉద్యోగులను ఆహ్వానించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, న్యాయస్థానాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును వెలువరించింది. ఉద్యోగుల సమస్యలపై నిర్వహించే సమావేశాలకు ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులు సమస్యలపై పోరాటం : ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించటం లేదని, పెన్షన్లు సమయానికి అందించటం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాటం చేస్తోంది.
హైకోర్టులో పిటిషన్ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ప్రభుత్వం గతంలో పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించింది. అవి ఫలించకపోగా ఉద్యోగ సంఘాలు ఈ చర్చలపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాలంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యమ కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు తమను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేసింది. తమను ఆహ్వానించే విధంగా ప్రభుత్వాని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరగా అంగీకరించింది.
గతంలోనూ హైకోర్టుకు : ప్రభుత్వం తమకు ఒకటో తేదీన జీతాలు అందించాలని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ను కలిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుర్యానారాయణ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
ఇవీ చదవండి :