AP Govt Employees Association: ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని.. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది. సూర్యానారాయణ నేతృత్వాన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సంఘం నాయకులు.. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులకు సుమారుగా 10వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. ఈ బకాయిలు ఇవ్వకపోగా.. పేరుకుపోయిన మొత్తం ఎంతుందో సమాచార హక్కు చట్టం కింద కోరినా చెప్పడం లేదన్నారు.
G.P.F ఖాతాల నుంచి డెబిట్ చేసిన మొత్తాన్ని ఎప్పుడు జమ చేస్తారో ప్రణాళిక వెల్లడించాలని కోరినా ప్రభుత్వం ప్రకటించడం లేదని ఆక్షేపించారు. గ్రామ పంచాయతీల ఆదాయంలో మొదటి హక్కుదారులుగా పంచాయతీ ఉద్యోగులను గుర్తించి, వారికి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని సూర్యనారాయణ చెప్పారు. అదే తరహాలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంమీద మొదటి హక్కుదారులుగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులను గుర్తించి... వారి క్లెయిమ్‌లను పరిష్కరించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
ఉద్యోగుల సమస్యలపై ఉద్యమం చేద్దామంటే ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందని.. పైగా సంఘాల్లో చీలిక తెస్తోందని సూర్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి అరియర్స్ ఇస్తారంటూ కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమంపై నీళ్లు చల్లుతున్నారని .. ప్రభుత్వం ఆడిస్తున్న ఆటలో ఉద్యోగులు బలవుతున్నారని ఆవేదన చెందారు. వేతన సవరణ సందర్భంగా గత జనవరి 7న ఉద్యోగులకు సంబంధించిన 77 డిమాండ్లను పరిష్కరించినట్లు సీఎం చెప్పారని.... కాని సర్వీసు ప్రయోజనాలు, ఆర్థిక సమస్యల్లో ఒక్కదాన్నీ ప్రభుత్వం పరిష్కరించలేదని స్పష్టంచేశారు. ఇప్పటికీ మీనమేషాలు లెక్కపెట్టాల్సిన అవసరం లేదని... ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం చేపట్టబోయే ఆందోళనకు ఉద్యోగులు సమాయత్తం కావాలని పిలుపిచ్చారు.
తమ అనుమతి లేకుండా G.P.F ఖాతాల నుంచి ప్రభుత్వం గత మార్చిలో దాదాపు 500 కోట్లు తీసుకుందన్న సూర్యనారాయణ.... దానిపై న్యాయ నిపుణులను సంప్రదించి కేసు పెడతామని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే కాగ్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
'ఉద్యోగుల జీత భత్యాలు, ఆర్ధిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తన నిబంధనల్ని తానే ఉల్లంఘిస్తోంది. అందుకోసమే ఓ ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల జీతాలను ఆలస్యం చేస్తున్నారు. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నారు. అందుకనే రాష్ట్రగవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాం. చట్టం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఎవ్వరూ ఆలోచించలేదు. గత కొంత కాలంగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చట్టం చేయాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. చట్టం ఉంటే న్యాయంగా తమకు వచ్చే జీతాలు, ప్రయోజనాలు ఇచ్చేవారు. మంత్రులు, అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది... ఇలా అందరినీ కలిశాం. అయినా ఇప్పటివరకు స్పందించకపోవడంతో గవర్నర్‌ను కలవడానికి వచ్చాం. ఉద్యోగులకు వివిధ రూపాల్లో వచ్చే అర్థిక లబ్ధికి సంబందించిన సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీ పెట్టుకుంటే సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే... రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం.' - సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చదవండి: