AP Fiber chairman gautham reddy: మొదటిరోజే మొదటి షో అనే ప్రాతిపదికన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సినిమాను అందించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఫైబర్ చైర్మన్ పి.గౌతం రెడ్డి తెలిపారు. అందుకే సినిమాలను తక్కువ ధరకే ప్రజలకు వినోదాన్ని అందించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇతర ఓటిటి యాప్‌లకు, థియేటర్లకు ఏపీ ఎఫ్ఎస్ఎల్ పోటీ కాదని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం లేదని అన్నారు. రేపు ఓ పెద్ద సినిమా రిలీజ్ సమయంలో ఏపీ ఫైబర్ ద్వారా ఓ చిన్న సినిమాను రూ. 39కే విడుదల చేస్తున్నామన్నారు. పెద్ద సినిమా విడుదల చేసే సమయంలో టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. పైరసీకి అవకాశం లేకుండా ఈ సినిమాలు విడుదలకు సాంకేతిక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టం జరిగే కంటెంట్ ఉంటే స్క్రీనింగ్ చేసే విడుదల చేస్తామన్నారు.
ఏపీ ఫైబర్ తరపున ఓటిటి తరహా యాప్: ఏపీ ఫైబర్‌కు ఉన్న 10 లక్షల మంది వినియోగదారుల్లో ఎక్కువ మందికి వినోదాన్ని కల్పించడమే తమ లక్ష్యమని గౌతంరెడ్డి అన్నారు. త్వరలో ఏపీ ఫైబర్ తరపున ఓటిటి తరహా యాప్ తీసుకువస్తామన్నారు. ఆరు నెలల్లో ఆ యాప్‌కు వచ్చే రెస్పాన్స్ ద్వారా ఇతర వీడియో కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ కంపెనీగా ఆర్థిక పరిస్థితి సహకరిస్తే భవిష్యత్ లో సినిమాలు కూడా నిర్మిస్తామన్నారు. ఈ విధానంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒకరిద్దరు వ్యతిరేకత వ్యక్తం చేసినా పరిశ్రమకు నష్టం ఉండదని మిగిలిన వారు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. వెబ్ సిరీస్, టెలి ఫిలింల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గౌతంరెడ్డి తెలిపారు.
ఇండస్ట్రియల్ కనెక్ట్: ఏపీ నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రియల్ కనెక్ట్ పేరిట కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రారంభమైన కియా నాలెడ్జ్ ఎక్సలెన్స్ సెంటర్ తరహాలోనే ఆ అనుసంధానం జరగాలని బుగ్గన పేర్కొన్నారు. ఆగస్ట్ 15వ తేదీ కల్లా ఇండస్ట్రియల్ కనెక్ట్ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 200 వరకూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. స్కిల్ హబ్‌లలో శిక్షణ కోసం ఇప్పటివరకూ 15,559 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే 308 బ్యాచ్లలోని 8,807 మందికి శిక్షణ పూర్తయిందని మంత్రికి తెలిపారు. ఇంకా 249 బ్యాచ్లలోని 6,733 మంది శిక్షణ దశలో ఉన్నట్లు రాజేంద్రనాథ్ రెడ్డికి వెల్లడించారు. 6,713 మంది యువతకు ధృవపత్రాలు అందజేశామన్నారు. స్కిల్ హబ్‌ల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా వందశాతం ప్లేస్ మెంట్లను నమోదు చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. నంద్యాల జిల్లా 93 శాతం మేర నమోదైందని తెలిపారు.