AP Debts : 'పిట్టను కొట్ట.. పొయ్యిలో పెట్ట' అన్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 331 రోజులు అప్పులతోనే రాష్ట్రం కాలం గడిపిందని 2022లో కాగ్ చెప్పింది. ఆ తర్వాతా పరిస్థితి మెరుగుపడలేదు. రిజర్వ్ బ్యాంకు కల్పించిన వెసులుబాటు అప్పులనూ నిత్యం ఉపయోగించుకోవడం.. వాటికీ వడ్డీ చెల్లించడం ఇదీ దుస్థితి. ఈ రోజు వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు చేసి వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే.. భవిష్యత్తు ఆదాయాలనూ ఇప్పుడే తాకట్టు పెట్టేసి అందినకాడికి రుణాలు తెచ్చుకోవడం మరో ఎత్తు. ఒకే ఆదాయాన్ని రెండుచోట్ల చూపించి మరీ సీఎం జగన్ (CM Jagan) సర్కారు అప్పులు తెచ్చేస్తోంది. రాబోయే ప్రభుత్వ హయాంలో తీసుకునే అప్పులకూ ఇప్పుడే చెల్లింపులు రాసేస్తోంది. వచ్చే ఏడాది మే, ఆగస్టు నెలల్లో బిల్లులు చెల్లింపులకు 15 వందల కోట్ల రూపాయల మేర గ్యారెంటీలు ఇస్తోంది. ఇదే క్రమంలో ఇక ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఇలా గ్యారెంటీలను వైసీపీ సర్కారు ఇచ్చేస్తుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
AP Debts in YSRCP Government : ఏటా రాష్ట్రాలు తీసుకునే అప్పులకు 15వ ఆర్థిక సంఘం పరిమితులు విధించింది. రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిలో 3.5 శాతానికి మించకుండా రుణాలు తీసుకోవచ్చు. దీనికి అనుగుణంగా కేంద్రం బహిరంగ మార్కెట్ రుణాలకు అనుమతులు ఇస్తోంది. విద్యుత్తు సంస్కరణలు, ఇతరత్రా రూపాల్లో మరో 0.5 శాతం అప్పులకు అవకాశం కల్పిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (Contributory Pension Scheme) కింద రాష్ట్రాలు చెల్లించే వాటా మొత్తానికి సమంగా మరికొంత తీసుకోవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాలను పెంచి చూపించి మరీ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. మరోవైపు కార్పొరేషన్ల రుణాల్ని రహస్యంగా ఉంచుతోంది.
Andhra Pradesh Debts 2019 to 2023 under Jagan Ruling : ప్రభుత్వ గ్యారెంటీలతో తీసుకునే అప్పులనూ నికర రుణ పరిమితిలో లెక్కించాల్సిందేనని ఆర్థికసంఘం పేర్కొన్నా అమల్లోకి రావడం లేదు. రుణ గ్యారంటీ (Loan Guarantee)ల పరిమితినీ జగన్ సర్కారు పెంచేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడిలో 90 శాతం దాకా ప్రభుత్వ గ్యారెంటీలు ఉండవచ్చని నిబంధన. ప్రభుత్వం దీనిని సడలించి 180 శాతానికి పెంచుకుంది.
గతంలో ఉన్న అప్పుల లెక్కల ప్రకారమే అసలు, వడ్డీలు, కార్పొరేషన్ల అప్పులు సహా కలిపి ఏడాదికి 50 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర సొంత రెవెన్యూ వసూళ్లకు తగ్గట్టుగా జీతాలు, పెన్షన్లకు ఆ రాబడి సరిపోతోంది. కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో వాటాల వంటి మొత్తాల్ని కలిపినా ఏటా పాత అప్పుల అసలు, వడ్డీల కిస్తీలు చెల్లించేందుకే చాలడం లేదు.
CAG Report on Andhra Pradesh Debts : కాగ్ విశ్లేషణ ప్రకారం.. కొత్త అప్పులు తెచ్చి పాత అప్పులు తీర్చాల్సి వస్తోంది. భవిష్యత్తు ఆదాయాలనూ ఇప్పుడే తాకట్టు పెట్టేసి, ఖజానా ఆదాయాన్ని పక్కదోవ పట్టించి అప్పులు తెస్తున్నారు. ఈ ధోరణి వల్ల రాబోయే ప్రభుత్వాలు నిస్సహాయస్థితిలోకి వెళ్తాయి. దీనికి తోడు పెండింగ్ బిల్లులు, వాటి గ్యారెంటీలూ కొత్త ప్రభుత్వాలకు ఏళ్ల తరబడి భారం కాబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమితులను ప్రస్తుత సర్కారు పరోక్షంగా వినియోగించుకుంటోంది.
Andhra Pradesh Debts 2023 : రాష్ట్రంలో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించిన ప్రభుత్వం.. కొన్ని మద్యం డిపోలకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు మళ్లించింది. ఆ ఆదాయాన్ని గ్యారెంటీగా చూపి 25 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఇలా భవిష్యత్తు ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టి దానిని కార్పొరేషన్‌కు మళ్లించి అప్పులు తేవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దీంతో బ్యాంకులు మొత్తం రుణం ఇవ్వకుండా కోత పెట్టాయి. కార్పొరేషన్లు తమ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చే ఆదాయం ఆధారంగానే రుణాలు తీసుకోవాలి. అలా కాకుండా కార్పొరేషన్లకు ఎలాంటి కార్యకలాపాలూ లేకుండా ప్రభుత్వమే గ్యారెంటీలిచ్చి.. ఆ రుణాల్ని చెల్లించేందుకు గ్రాంట్లు ఇచ్చి దొడ్డిదోవన అప్పులు తెస్తోంది.
CAG Report on AP Debts : మద్యంపై వ్యాట్‌ను తగ్గించిన సర్కార్ ఆ మేరకు వివిధ మద్యం బ్రాండ్లపై సుంకం విధించి వసూలు చేసుకునే అధికారాన్ని బెవరేజస్ కార్పొరేషన్‌కు ఇచ్చింది. ఆ ఆదాయాన్ని ఆధారంగా చూపి అప్పులు తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఖజానాకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. ఏళ్ల తరబడి ఈ ఆదాయాన్ని అప్పులు తీర్చేందుకే వెచ్చించాలి. గుత్తేదారుల బిల్లుల చెల్లింపులకూ ఈ ప్రభుత్వం అనధికారిక గ్యారెంటీలు ఇస్తోంది. ఆ గ్యారెంటీల్నీ చూపి వారు పరోక్ష అప్పులు తెచ్చుకుంటున్నారు. వాటి భారము ప్రభుత్వంపై పడుతోంది.