AP CM REVIEW ON PANCHAYATHIRAJ AND RURAL DEVELOPMENT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై అధికారులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో.. స్వయం సహాయక సంఘాల గురించి, ఉపాధి హామీ పథకం గురించి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నాణ్యత గురించి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కనీసం ఐదేళ్లపాటు నాణ్యత ఉండాలి.. ముందుగా స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు మంచి మార్కెట్ వ్యవస్ధ కల్పించేందుకు బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలతో జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి గత ఏడాది పెండింగ్ నిధులను కేంద్రం నుంచి తెప్పించుకునే ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నాణ్యతపై దృష్టి పెట్టాలన్న సీఎం.. రోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలని సూచించారు.
నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తాం.. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆయా శాఖల్లో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, ప్రగతిపై చర్చించారు. మహిళల స్వయం సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్న ముఖ్యమంత్రి.. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. అనంతరం చేయూత కింద అర్హత సాధించిన ప్రతి లబ్ధిదారునికి నాలుగేళ్లపాటు వరుసగా క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయమనేది అందుతుందని వెల్లడించారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి జిల్లాకు రెండు సూపర్ మార్కెట్‌లు.. అధికారులు మాట్లాడుతూ.. చేయూత పథకం ద్వారా ఇప్పటివరకు 45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే ఒప్పందాలు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్,లేస్ పార్కు, ఇ–కామర్స్, ఇ-మిర్చి, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్‌ల చొప్పున మొత్తం 27 చేయూత మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నామని సీఎం జగన్‌కు వివరించారు.
ఈ ఏడాది 1500 లక్షల పని దినాలు.. చివరగా ఉపాధి హామీ పథకం అమలుపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఉపాధి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాల కల్పన జరిగిందని, పనిదినాల రూపంలో రూ. 5280 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఉపాధి హామీ (వంద రోజుల పథకం)కి సంబంధించి గడిచిన ఆర్థిక సంవత్సరంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ. ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ డబ్బులను కేంద్రం నుంచి తెచ్చుకోవడంపై అధికారులు చర్యలు, ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ పూర్తి చేయాలని, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ఇవీ చదవండి