Anganwadi Workers Protest in AP : సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి సమ్మె కొనసాగిస్తుండగానే అధికార యంత్రాంగం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి.. పౌష్టికాహార నిల్వలను, అంగన్వాడీ కేంద్రాల బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, రామవరప్పాడు, ప్రసాదంపాడులోని అంగన్వాడీ కార్యాలయాల తాళాలు పగులగొట్టి అధికారులు, సచివాలయ సిబ్బంది లోపలికి ప్రవేశించారు. పెనుగంచిప్రోలులో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొడుతున్నారన్న సమాచారంతో అంగన్వాడీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్ష గట్టి తాళాలు పగలగొట్టించడం సరైన చర్య కాదని హెచ్చరించారు.
Anganwadi Workers Problems in AP : అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందే పల్లె మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో బద్దలు కొట్టారు. సరుకుల నిలువలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం మసీదు కట్ట కాలనీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పడంతో అధికారులు రెండు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టారు.
హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు
Anganwadi Agitation Statewide : ఉరవకొండలో తాళాలు పగలకొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఉరవకొండ - గుంతకల్లు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, తాడిమర్రిలో సచివాలయ, గ్రామ పంచాయితీ అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులకొట్టి వాటి స్థానంలో కొత్తవి వేశారు.
Anganwadi Workers Problems Increase in YSRCP Government : ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో 52అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు, అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది తాళాలు పగలకొట్టి తెరిచారు. స్థానికులు, అంగన్వాడీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. తాళాలు పగలకొట్టడం ఏ మాత్రం సమంజసం కాదని, దొంగలు చేసే పని సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజులుగా తిండి తిప్పలు లేకుండా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనికరం కూడా లేదని మార్కాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె - మూతపడిన కేంద్రాలు
Anganwadi Staff Situations in AP : ఏలూరు జిల్లా లక్కవరం గ్రామంలోని అంగన్వాడీ ప్రీస్కూల్ తాళాలను గ్రామ సచివాలయ సిబ్బంది పగలుకొట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో 8 కేంద్రాల తలుపులు బద్దలు కొట్టిన అధికారులు మిగిలిన కేంద్రాలను సచివాలయ సిబ్బంది చేత తెరిపిస్తామని వెల్లడించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి సచివాలయ సిబ్బందికి అప్పగిస్తుందని అంగన్వాడీ సిబ్బంది మండిపడ్డారు.
CM Jagan Cheating Anganwadi Workers : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజూ ఉధృతంగా సాగింది. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు.
అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న