Vijayawada Central Constituency Residents Fire on ycp leaders: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన నాయకులు.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దొంగ ఓట్లను సృష్టిస్తూ, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారని.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై, దొంగ ఓట్ల తయారీపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాజాగా తొలగించిన ఓట్ల సంఖ్యను, దొంగ ఓట్ల వివరాలను వారు మీడియాకు వెల్లడించారు.
ఓటర్ల జాబితాను వారికి కావాల్సినట్లు మారుస్తున్నారు.. దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధల ప్రకారం.. ఓటర్ల జాబితాను ప్రతి ఏటా సవరించడం ఒక ఆనవాయితీ. అయితే, వచ్చే ఏడాది రాష్ట్రం (ఏపీ)లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా భారీగా ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల చేర్పులు వంటివి చోటు చేసుకుంటున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నగరపాలక సంస్థలోని మొత్తం 21 డివిజన్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు కేవలం.. 25 ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి బొండా ఉమాపై గెలుపొందారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బొండా ఉమా గెలుస్తారనే ఉద్దేశంతో ఓటర్ల జాబితాను కావాల్సినట్లు మారుస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. దీంతో కొంతమంది ప్రతిపక్ష నేతలు నియోజకవర్గం మొత్తం తిరిగి సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
మూడు వేల ఓట్లు తగ్గాయి.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రాంత వాసులు మీడియాతో మాట్లాడుతూ..''నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరాల ప్రకారం.. పట్టణాల్లో సహజంగా ఓట్లు ఒక ఎలక్షన్ నుంచి తర్వాత ఎలక్షన్‌కి పెరుగుతాయి. కానీ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారుగా 3 వేల ఓట్లు తగ్గాయి. దీని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి.. విచారణ చేపట్టాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 193లో ఒకే డోర్ నెంబర్ మీద 364 ఓట్లు నమోదు అయ్యి ఉన్నాయి. బూత్ నెంబర్ 157లో ఓకే డోర్ నెంబర్ మీద 56 ఓట్లు నమోదు అయ్యి ఉన్నాయి. బూత్ నంబర్ 35లో ఒకే డోర్ నెంబర్ మీద 501 ఓటు నమోదు అయ్యాయి. అంటే ఇవన్నీ దొంగ ఓట్లు.. అంతేకాదు, సుమారుగా 3500 ఓట్లు.. ఒకే డోర్ నెంబర్ మీద 200 కంటే ఎక్కువగా నమోదయ్యాయి'' అని అన్నారు.
భార్యాభర్తల బూత్‌లను మార్చేశారు.. అనంతరం ఒక బూత్‌లో ఉన్నటువంటి భార్యాభర్తల ఓట్లను.. భర్త ఒక బూత్‌లో, భార్య ఒక బూత్‌లో ఓటు వేసే విధంగా జాబితాను మార్చారని..సెంట్రల్ నియోజకవర్గం ప్రాంత వాసులు ఆరోపించారు. సుమారు వారు నివసించే ప్రాంతం నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల అవతల బూతులను కేటాయించారని వాపోయారు. ఇలా చేస్తే.. ఆ ఓటర్ ఎలా వెళ్లి ఓటు వేస్తారు అని ప్రశ్నించారు. మరోవైపు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల, ఆ పార్టీ అభిమానుల, సానుభూతిపరుల ఓట్లను తీశారని గుర్తు చేశారు. వీటన్నింటిపై ఎలక్షన్ కమిషన్ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.