Govt Employees Advisor Chandrasekhar Reddy comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు, ఉద్యోగ సంఘాల నాయకులు.. గతకొన్ని నెలలుగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమల్లోకి తీసుకురావాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు, ఉద్యమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రుల కమిటీ.. సోమవారం (నిన్న) రోజున మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమైంది. సమావేశంలో కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అయితే, ఆ చర్చలో మంత్రుల కమిటీ.. ఉద్యోగుల విషయంలో ఏయే హామీలు ఇచ్చింది..? సీపీఎస్ రద్దుపై ఏ నిర్ణయం తీసుకుంది..? కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ఏ విధమైన చర్య తీసుకుబోతుంది..? అనే వివరాలను ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
మంత్రుల కమిటీ భేటీపై అందరిలో సంతృప్తి వ్యక్తమైంది.. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘంగా చేస్తున్న పోరాటంపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాజాగా మంత్రుల కమిటీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయింది. ఆ భేటీపై ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నేడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన మంత్రుల కమిటీ భేటీపై అందరిలో సంతృప్తి వ్యక్తమైందన్నారు. మంత్రుల కమిటీ సమావేశం తర్వాత ప్రకటించిన నిర్ణయాల వల్ల.. ఉద్యోగ సంఘాల ఆందోళనలు ఇక ఉండవని భావిస్తున్నామన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ ఎరియర్స్ కింద 16 వాయిదాల్లో రూ.7వేల 382కోట్ల రూపాయలను ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు.. ఐదేళ్ల సర్వీసు కలిగిన కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య.. 10 వేల వరకు ఉంటుందని.. వారిని క్రమబద్దీకరించే అంశాన్ని కేబినెట్ భేటీ తర్వాత ప్రకటిస్తారన్నారు. ఓపీఎస్‌తో సమానమైన పెన్షన్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సీపీఎస్ ఉద్యోగులు.. కేబినెట్ తీసుకునే నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేస్తాయని చంద్రశేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ సంఘాలతో..మంత్రుల కమిటీ భేటీ: ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సోమవారం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల కమిటీ.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దుపై ఎలాంటి హామీ గానీ స్పష్టత గానీ ఇవ్వలేదు. గతంలో ప్రకటించినట్లే గ్యారెంటీ పెన్షన్ పథకం(జీపీఎస్) కింద అమలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సీపీఎస్ ఉద్యోగులకు ముప్పైమూడు శాతం గ్యారెంటీ పెన్షన్ ఉండేలా జీపీఎస్‌లో పలు మార్పులు చేస్తామని పేర్కొంది. ఈ అంశంపై త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించి.. ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించింది.