KR Suryanarayan Anticipatory Bail Petition Updates: వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్న ఫిర్యాదుపై గత నెల 30వ తేదీన విజయవాడ పటమట పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో అయిదోవ నిందితుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను చేర్చారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసేందుకు అధికారులు గాలిస్తున్నారు.
వేధించడం కోసమే తప్పుడు కేసు నమోదు చేశారు.. ఈ క్రమంలో విజయవాడ పటమట పోలీసులు తన (సూర్యనారాయణ)పై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తాజాగా విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలాలు చేశారు. ఆ పిటిషన్‌లో.. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారన్నారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న తనను వేధించడం కోసం తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ 1వ డివిజన్ నిఘా విభాగంతో ఎటాచ్ అయి తాను పనిచేయలేదని తెలియజేశారు. ఆ విభాగానికి సంబంధించిన ఖాతాలు, పుస్తకాలపై తనకు ఎటువంటి నియంత్రణ లేదని కేఆర్ సూర్యనారాయణ వివరించారు.
ఈ కుట్ర వెనక ఇతరుల ప్రమేయం ఉంది.. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జాప్యం కావడంపై అధ్యక్షుడి హోదాలో గతంలో తాను గవర్నర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించానని.. ఏపీజీఈఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వెల్లడించారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడాక ప్రభుత్వం తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. హైకోర్టును ఆశ్రయించి.. దాని అమలును నిలుపుదల చేయించానని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న తనను ఇబ్బందికి గురిచేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. దీని వెనుక ఇతరుల ప్రమేయం ఉందన్నారు. ఎలాంటి నేరానికి పాల్పడలేదన్నారు. తనకు గుండె శస్త్ర చికిత్స జరిగిందన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు.
ముందస్తు బెయిలు మంజూరు చేయండి.. చివరగా తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తిరిగుతున్నారని..కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. వ్యక్తిగత లబ్ధి కోసం వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండీ కొట్టేలా వ్యవహరించారనే ఆరోపణతో కేఆర్ సూర్యానారాయణతోపాటు మరో నలుగురు ఉద్యోగులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవల నలుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయిదో నిందితుడిగా ఉన్న సూర్యనారాయణను అరెస్ట్ చేసేందుకు గాలిస్తుండగా.. ముందస్తు బెయిలు కోసం ఆయన విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.