Alla Ramakrishna Reddy protest: కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడిస్తారనే అనుమానంతో బుధవారం అర్ధరాత్రి ఆ పార్టీ నాయకులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావును బాపులపాడు మండలంలోని రంగన్నగూడెంలో వీరవల్లి పోలీసులు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. దీనిమీద తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఆయన.. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. గన్నవరంలో జరిగిన విధ్వంసంలో కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో, వీర విహారం చేసిన వైసీపీ గుండాల్ని కనీసం నిలువరించని పోలీసులు.. బాధితులైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మీద మాత్రం హత్యాయత్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియంతృత్వ పోకడలు శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్ర ప్రభుత్వం తమ వికృత రాజకీయాలకు వారిని పావులుగా వాడుకుంటున్నారని, ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి ఘటనలో సుమోటోగా కేసు రిజిస్టర్ చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిమీద నిందితుల పూర్తి వివరాలతో బుధవారం గన్నవరం పోలీస్ స్టేషన్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు ఫిర్యాదు చేశారని.. పోలీసులు ఇప్పటికైనా స్పందించి కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ గుండాలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గన్నవరంలో వైసీపీ గుండాలు చేసింది తెలుగుదేశం కార్యాలయంపై దాడి కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వర్ణించారు.
ఇవీ చదవండి: