All Parties Round Table Meeting In Vijayawada: నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి.. నేను ప్రత్యేక హాదాను సాధిస్తానని గతంలో చెప్పిన సీఎం జగన్.. నేడు 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా ఊసెత్తడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విజయవాడ దాసరిభవన్లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీ నేతలు తమ అభిప్రాయాలను తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాను మర్చిపోయాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాలు బస్సుయాత్రకు పిలుపునిచ్చాయి.
ఈనెల 20 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. హిందుపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. తమ యాత్ర ద్వారా ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అఖిలపక్ష పార్టీలు దీనికి మద్ధతిచ్చాయి. ప్రభుత్వం యాత్రల నిషేధం పేరుతో అడ్డంకులు విధించినా.. యాత్ర చేసి తీరుతామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.
'విభజన హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. బీజేపీ, వైసీపీ కాకుండా మా బస్సు యాత్రకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. జగన్ కొత్త జీవోలతో మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితే వస్తే, విద్యార్థులమంతా ఉద్యమం చేపటైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాం. విశాఖ ఉక్కు, కడప ఉక్కు విషయంలో ప్రభుత్వ తమ నిర్ణయాన్ని వెల్లడించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి ప్రత్యేక హోదాను పొందేందుకు కృషి చేస్తాం.'- రామన్న, డీవైఎఫ్ఐ,రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చదవండి: