Agitation of villagers in front of police station: ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆస్పత్రి మార్చురీ ఎదుట హత్యకు గురైన వెంకటేశ్వర బంధువులు ధర్నాకు దిగారు. హత్య కేసులో నిందితులందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కేసులో నిందితులకు అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతూ కొంతమంది నిందితులను తప్పించారని ఆరోపించారు. నందిగామ మండలం పల్లగిరి కొండ వద్ద ఈరోజు ఉదయం కీసర గ్రామానికి చెందిన కురాకుల వెంకటేశ్వరరావు (35) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హత్యకు పాల్పడ్డ సాంబశివతో పాటు అతని ఇద్దరు కుమారులు పేర్లు చేర్చాలని ఆందోళనకు దిగారు. అతని కుమారుల్లో ఒకరు అమెరికా వెళ్లాల్సి ఉందని చెప్పి.. ఆయన పేరు ఎఫ్ఐఆర్ నుంచి అధికార పార్టీ నాయకులు తొలగించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళనను విరమించమని,.. మార్చురీ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లమని హెచ్చరించారు. దీంతో నందిగామ సీఐ సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని బంధువులు గ్రామస్థులతో మాట్లాడారు. కేసులో నిందితులందరినీ చేర్చుతామని, దర్యాప్తు చేస్తున్నామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ జరిగింది..: కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వరరావు (35) ను కొందరు వ్యక్తులు బీరు సీసాలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య గురైన వ్యక్తి మద్రాస్ టీ స్టాల్లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడని.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని మృతుడి బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయనను ఇంటి నుంచి కొందరు నందిగామకు తీసుకొచ్చారని..ఆ వ్యక్తులే ఆయనను హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు ఆర్థిక గొడవలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నందిగామ ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి, సీఐ సతీష్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: