Builder murder case: 2021 నవంబరు 1వ తేదీ.. విజయవాడ శివారు.. పాయకాపురం ప్రాంతంలోని 61వ డివిజన్ దేవినేని గాంధీపురంలో పీతల అప్పలరాజు అలియాస్ రాజు (47) అనే బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సెంటరులో కొన్నేళ్ల నుంచి బిల్డర్‌గా చేస్తున్నాడు. అందరికీ సుపరిచితుడైన రాజు ఆర్థికంగా కూడా స్థితిమంతుడు. ఎవరితోనూ గొడవలు పడడనే పేరున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా దారుణ హత్యకు గురయ్యాడన్న వార్త స్థానికంగా సంచలనం రేపింది. తల భాగం, ముఖంపై తీవ్ర గాయాలను పోలీసులు గుర్తించారు. ఇనుప రాడ్‌తో కొట్టిన దెబ్బలు ఉన్నట్లు తేల్చారు.
పోలీసు జాగిలం స్థానికంగా ఇళ్ల మధ్యనే కొద్దిసేపు తిరిగి, వాంబేకాలనీ రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్దకు వెళ్లి ఆగిపోయింది. మృతుడి ఫోన్ రికార్డులను, సమీపంలోని మద్యం దుకాణం వద్ద, ఇతర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని టవర్ డంప్ వివరాలను తెప్పించి విశ్లేషించారు. ఎక్కడా నిందితుల తాలూకూ ఆనవాళ్లు దొరకలేదు. రాజు ఉండే కింది అంతస్తులో అతని వద్ద పనిచేసే సూపర్‌వైజర్ సాయికుమార్ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వారిని కూడా విచారించారు. వీరిని దాదాపు పది రోజుల పాటు వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెడుతున్నారని సాయికుమార్ బంధువులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో వెనక్కి తగ్గారు. వారిని విడిచిపెట్టారు. ఇంతలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చింది. విషప్రయోగం జరిగిందని తేలింది. ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు అటకెక్కింది.
సుపారీ కుదరక: ఈ హత్య కేసు ఎటూ తేలకపోవడంతో మృతుని భార్య న్యాయం చేయమని.. గత రెండు నెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయికుమార్‌పై అనుమానంతో మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండల ఇన్‌ఛార్జి డీసీపీ కొల్లి శ్రీనివాస్, నున్న సీఐ కాగిత శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం విచారణను ముమ్మరం చేసింది. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అన్నీ పూసగుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం.
* పీతల అప్పలరాజు అలియాస్ రాజు దేవినేని గాంధీపురంలో ఓ ఇంట్లోని పై అంతస్తులో రాజు ఒంటరిగా అద్దెకు ఉండేవాడు. మూడేళ్ల క్రితం కుటుంబాన్ని విశాఖపట్నం తీసుకెళ్లి అక్కడే ఉంచాడు. విజయవాడలోనే ఉంటూ స్థానికంగా భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లు చేసుకునే వాడు. ప్రతి 15, 20 రోజులకు ఒకసారి విశాఖపట్నంలోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వస్తుంటాడు. కింది అంతస్తులో రాజు వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేసే సాయికుమార్, భార్య సుధతో కలిసి అద్దెకు ఉండేవాడు. బిల్డర్ ఒక్కడే ఉంటుండడంతో సుధ వంట చేసి తీసుకెళ్లి ఇచ్చి వస్తుండేది. ఈ నేపథ్యంలో ఆమెను లైంగికంగా వేధిస్తుండేవాడు. విషయం తెలుసుకున్న సుధ సోదరుడు భవానీశంకర్.. సాయికుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించాడు. పీతల రాజును చంపేందుకు ఓ రౌడీషీటర్‌ను సంప్రదించారు. సుపారీ మొత్తం కుదరకపోవడంతో సొంతంగా చంపాలని నిర్ణయించారు. గతేడాది అక్టోబరు 31న రాత్రి చేపల పులుసులో ఎలుకల మందును కలిపి, భోజనాన్ని పై అంతస్తులో ఉన్న రాజు గదికి సుధ తీసుకెళ్లి ఇచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు తలుపు లోపల గడియ వేయకుండా కిందకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో సుధ, సాయికుమార్, భవానీ శంకర్‌లు రాజు గదిలోకి వెళ్లి ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. దొంగల పనిగా భ్రమింపజేసేందుకు మృతుని మెడలోని బంగారు గొలుసు , ఉంగరాలను తీసుకెళ్లారు.
ఆధారాలు లభ్యం: విచారణలో నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా వీరు ఎలుకల మందును కొనుగోలు చేసిన దుకాణంలో విచారించి రూఢీ చేసుకున్నారు. మృతుడి ఒంటిపై చోరీ చేసిన ఆభరణాలను విక్రయించిన దుకాణంలో విచారించి, వాటిని రికవరీ చేశారు. హత్యకు ఉపయోగించిన రాడ్డును.. ఇంటికి వెనుక ఉన్న చిన్నపాటి చెరువులో సుదీర్ఘంగా గాలించగా ఎట్టకేలకు దొరికింది. దీంతో ఆధారాలు లభించడంతో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉందని భావిస్తున్నారు. వివరాలు నేడో, రేపో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: