New Electricity Charges : ఈ నెలలో రానున్న విద్యుత్ బిల్లు విద్యుత్ వినియోగదారులకు ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉండనుంది. 2021-22వ సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట 3 వేల 82.99 కోట్ల రూపాయలు.. విద్యుత్ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేయనున్నాయి. 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య 5 ఏళ్ల వినియోగించిన విద్యుత్‌కు డిస్కంలు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తూన్నాయి. దీంతో అప్పుడే వినియోగదారులపై భారం వేసిన .. ఇప్పుడు మరో 12 నెలల పాటు అదనపు భారం మోపుతున్నాయి.
అందుబాటులో ఉండే విద్యుత్ అంచనాలు.. వాస్తవ విద్యుత్ లభ్యత లెక్కల్లో వచ్చిన వ్యత్యాసం కారణంగా మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనేందుకు ఖర్చుచేశామన్న డిస్కంలు.. ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారించి.. ఏప్రిల్ నెల నుంచి వసూలు చేసుకోడానికి డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్‌సీ అనుమతించింది. ఈ మొత్తాన్ని 2021-22 సంవత్సరంలో అప్పటి విద్యుత్ వినియోగం ఆధారంగా.. 2024లో మార్చి వరకు బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేయనున్నాయి. 2014-19 మధ్య వినియోగించిన విద్యుత్‌కు 2 వేల 910.74 కోట్ల రూపాయలను ట్రూ అప్ కింద గత ఏడాది ఆగస్టు నుంచి 36 నెలల పాటు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. అదే భారంగా ఉందని అనుకున్న సమయంలో.. ఈ నెల బిల్లులో అదనంగా పడే సర్దుబాటు ఛార్జీలతో మరింత భారం పడుతుంది.
2021-22 సంవత్సరంలో వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి 67 వేల 756.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతుందని వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి. కానీ 54 వేల 965.7 మిలియన్ యూనిట్లే వచ్చింది. దాంతో 11 వేల 773 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. ఏపీఈఆర్‌సీ యూనిట్ విద్యుత్ కొనుగోలుకు అనుమతించిన ధర కన్నా సుమారు 9 రెట్లు అదనంగా ఖర్చు చేశాయి. దాంతో సర్దుబాట్లు పోను 3 వేల 82.99 కోట్ల రూపాయల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది.
గతంలో కంటే భిన్నంగా ఏపీఈఆర్‌సీ ట్రూఅప్ ఛార్జీల వసూలు చేసే విధానంలో మార్పులు చేసింది. గతంలో డిస్కంలు చేసిన మొత్తం ఖర్చును విడివిడిగా లెక్కించి.. అదనపు మొత్తాన్ని ఆయా డిస్కంల పరిధిలో వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు ట్రూ అప్ మొత్తాన్ని ఆయా డిస్కంల పరిధిలోని వినియోగదారుల నుంచి యూనిట్‌కు 29 పైసల వంతున వసూలు చేసేలా అనుమతించింది. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చు 427.08 కోట్ల రూపాయలు ఉంటే.. సర్దుబాటు ఛార్జీల రూపేణా 717.77 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలుచేయనుంది. దీనివల్ల సీపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 290.70 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలి. ప్రభుత్వం వివిధ సబ్సిడీ పథకాల కింద టారిఫ్ ఆర్డర్‌లో 8 వేల 78.48 మిలియన్ యూనిట్లను కేటాయిస్తే.. వాస్తవంగా 6 వేల 792.77 మిలియన్ యూనిట్లు విద్యుత్‌నే వినియోగించినట్లు తేల్చింది. దాంతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపేణా వసూలు చేసిన మొత్తం 375.98 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని తేల్చింది. వెనక్కి చెల్లించాల్సిన మొత్తాన్ని 2023-24 సంవత్సరం టారిఫ్ ఆర్డర్‌లో ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలో సర్దుబాటు చేస్తామని ఏపీఈఆర్‌సీ తెలిపింది.
ఇవీ చదవండి :