Heavy Charges On Hajj Pilgrims From vijayawada : విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు ఈ సారి 83వేల రూపాయల అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు కేంద్ర హజ్ కమిటీ ధరలను ఖరారు చేసింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన టికెట్, ఇతర వసతులకు 3 లక్షల 5 వేల ధర ఉండగా, విజయవాడ నుంచి మాత్రం 3 లక్షల 88 వేలుగా నిర్ణయించారు. బెంగళూరు ధరతో పోల్చినా కూడా ఏపీ యాత్రికులపై అదనపు భారం పడుతోంది.
వసతుల కల్పన, ఇతర ఖర్చులకు మూడుచోట్ల 2 లక్షల రూపాయల వరకు ఉండగా, విమాన టికెట్ ధరలో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి టికెట్ ధర లక్షా 3 వేలు కాగా, విజయవాడ నుంచి లక్షా 88 వేలుగా ఉంది. ఈ వ్యత్యాసాలపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2020లో విజయవాడ విమానాశ్రయానికి కేంద్రం ఎంబార్కేషన్ పాయింట్ కేటాయించింది. అప్పట్లో హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడ టికెట్ ధర 15 వేల నుంచి 18 వేల వరకు తేడా ఉందని ముస్లిం సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా 83 వేల వరకు ఎక్కువ ఉండటంతో ధర తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రం నుంచి వచ్చే నెల 7న హజ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రికుల్లో 3 లక్షల ఆదాయం ఉన్న వారికి 60 వేలు, అంతకు పైగా ఉన్న వారికి 30 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఎక్కడి నుంచైనా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హజ్ కమిటీ భిన్నంగా వ్యవహరించాయి. 2023 హజ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం వర్తించాలంటే ఏపీ యాత్రికులు గన్నవరం విమానాశ్రయం నుంచే వెళ్లాలని షరతు పెట్టారు. పలువురు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరినా అంగీకరించలేదు. ఈ ఏడాది ఏపీకి చెందిన 2 వేల 319 మంది యాత్రకు వెళుతుండగా, వారిలో 19 వందల 82 మంది విజయవాడ నుంచి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే టికెట్ ధరల వ్యత్యాసం భారీగా ఉండటంతో హజ్ యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ ధరల తగ్గింపుపై కేంద్రంతో మాట్లాడుతున్నామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. ఒకవేళ సానుకూల స్పందన రాకుంటే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
"హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడ టికెట్ ధర 83 వేల రూపాయలు ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి వెళితే ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చుతో విజయవాడ నుంచి పంపిచాలని డిమాండ్ చేస్తున్నాం."- ఫారూఖ్ షిబ్లీ, రాష్ట్ర అధ్యక్షుడు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి
ఇవీ చదవండి