Actions on Vijayawada RTC Bus Accident: విజయవాడ బస్టాండ్‌లో బస్సు ప్రమాద ఘటనపై ఆర్టీసీ చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదంపై ట్రాఫిక్, మెకానికల్, పర్సనల్ డిపార్టుమెంట్ అధికారులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సిఫారసు మేరకు.. ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకున్నారు. డ్రైవర్, ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
తప్పుగా గేర్ ఎంపిక వల్లే బస్సు దూసుకుపోయిందని కమిటీ తేల్చింది. బస్ డ్రైవర్ ప్రకాశంపై సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. అదే విధంగా విధుల పర్యవేక్షణలో ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి. లక్ష్మి విఫలమయ్యారని నిర్ధారించారు. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఆటోనగర్ డీఎం ప్రవీణ్‌కుమార్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.
ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్ ఘటన - సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు
Vijayawada RTC Bus Accident Enquiry Report: ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపిన రవాణా శాఖ అధికారుల బృందం.. నివేదికను రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించింది. డ్రైవర్‌కు సరైన శిక్షణ ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు బస్సు అప్పగించినట్లు కమిటీ తేల్చింది. డ్రైవర్‌కు బస్సులోని ఆటో మేటిక్ గేర్ సిస్టంపై సరిగా అవగాహన లేదని దర్యాప్తు బృందం తేల్చింది.
అత్యధిక హార్స్ పవర్ ఇంజిన్ సహా, ఆటోమేటిక్ గేర్ సిస్టం ఉన్న ఓల్వో బస్సును నడపాలంటే.. ఆ బస్సును తయారు చేసిన ఓల్వో కంపెనీ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బస్సు నడిపిన డ్రైవర్‌కు కంపెనీ నిపుణులతో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తెలిపింది. డ్రైవర్ ప్రకాశంకు సూపర్ లగ్జరీ బస్సును నడపడంలో అపార అనుభవం ఉందని, అధునాతనంగా వచ్చిన ఆటోమేటిక్ గేర్ సిస్టం కల్గిన బస్సులను నడపడంలో మాత్రం సరిగా అవగాహన లేదని, దీనివల్లే ప్రమాదం జరిగినట్లు తేల్చింది.
ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లతోనే బస్సు నడపాల్సి ఉండగా ఆర్టీసీ అధికారులు అలా చర్యలు తీసుకోకపోవడంతోనే దుర్ఘటన జరిగేందుకు కారణమైందని దర్యాప్తు కమిటీ తేల్చింది. రవాణా శాఖ నివేదికలోని అంశాలపైన.. ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమీక్షించారు. పోలీసు, ఆర్టీసీ అధికారుల దర్యాప్తు నివేదికలను పరిశీలించి అన్ని అంశాల ఆధారంగా.. తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
రెప్పపాటు వ్యవధిలో బస్సు బీభత్సం - ముగ్గురు బలి - ఈ తప్పిదానికి కారణం ఎవరు?
Vijayawada RTC Bus Accident CCTV Footage: సోమవారం ఉదయం 24 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు 12 నెంబర్ ప్లాంట్ ఫాం వద్ద సిద్ధంగా బస్సు.. రెప్పపాటు వ్యవధిలోనే బీభత్సం సృష్టించింది. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఆరు నెలల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా బస్సు రావడం.. అదే విధంగా ప్రయాణికులు ఉన్న ఫుట్‌పాత్ ఎత్తు తక్కువగా ఉండటంతో.. ప్రయాణికుల మీదకు బస్సు దూసుకొచ్చింది. బస్సు ప్రమాద ఘటన సీసీ టీవీ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.