AP High Court Latest judgments: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో.. స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వటంపై గత సంవత్సరం అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) మరోసారి విచారణ చేపట్టింది. దీంతోపాటు పరిహారాల చెల్లింపులపై దాఖలు చేసిన పిటిషన్లపై కూడా ధర్మాసనం విచారణ చేసింది. వాదోపవాదనలు విన్న తర్వాత.. రాజధానికి సంబంధించిన అంశాలపై దాఖలు చేసిన వ్యాజ్యాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం.. స్థానికేతరులకు రాజధానిలో ఇళ్ల పట్టాలివ్వకూడదని పిటిషనర్ల తరుపు న్యాయవాది గతంలోనే తెలిపారు. నిబంధనల్లో మార్పులు చేయాలంటే ప్రజాసభలు నిర్వహించి.. ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని న్యాయవాది ధర్మాసనానికి సూచించారు. రాజధాని పిటిషన్లను విచారించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు నేడు విచారణకు వచ్చాయి.
అసలు ఏం జరిగిందంటే: గత సంవత్సరం రాజధాని అమరావతికి రైతులు ఇచ్చిన భూముల్లో.. రాజధానేతర ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సీఆర్‌డీఏ సవరణ చట్టం (యాక్ట్ 13) తీసుకొచ్చింది. మాస్టర్ ప్లాన్‌లో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గెజిట్ ప్రకటనను కూడా విడుదల చేసింది. దాంతో ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనలను సవాలు చేస్తూ.. మందడం, లింగాయపాలెం గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్.. సీఆర్‌డీఏ కమిషనర్, పంచాయతీల ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆ తర్వాత రాజధాని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల పంపిణీపై గ్రామ సభలు నిర్వహించకుండానే అభ్యంతర ప్రతాలు అడుగుతున్నారని అమరావతి రైతులు.. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మిగిలిన 17 గ్రామాలకు సంబంధించి రెండ్రోజుల్లో గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) మరోసారి విచారణ చేపట్టింది. ఈసారి పరిహారాల చెల్లింపులపై దాఖలు చేసిన పిటిషన్లపై కూడా ధర్మాసనం విచారణ చేసింది. రాజధానికి సంబంధించిన అంశాలపై దాఖలు చేసిన వ్యాజ్యాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి