Two Sisters Protest: ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదా ఆడపిల్లగా పుట్టడం శాపమా అని మాధవి, మంజుల అనే ఇద్దరు యువతులు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన రామకృష్ణకు మాధవి, మంజుల అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్ల అమ్మ 11 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. దాంతో రామకృష్ణ మరో వివాహం చేసుకున్నాడు. తండ్రి సరిగ్గా చూసుకోకపోవడంతో మాధవి కష్టపడి తన చెల్లెలు మంజులను చదివించింది. మంజుల బీటెక్ చదివి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించింది.
ఇప్పుడు వివాహం చేసుకోవడానికి తమకు సంబంధించిన వాటా అడిగితే.. చిన్నాన్న మద్దయ్య, తండ్రి రామకృష్ణలు కొట్టి, ఇంటి నుంచి తరిమేశారు. కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదా ఇవన్నీ కాగితాలకే పరిమితమా అని వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డోన్ తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పటికైనా చిన్నాన్న, నాన్న దయవుంచి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
ఇదీ చదవండి: Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మళ్లీ ప్రారంభం