Nara Lokesh Yuvagalam Padayatra at Allagadda: యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బహిరంగసభలో మాట్లాడిన నారా లోకేశ్.. జగన్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. బాబాయ్ హత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. కడపలో అన్ని ఆసుపత్రులు ఉండగా.. అవినాష్ రెడ్డి తన తల్లిని కర్నూలుకు తరలించి.. డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. అవినాష్‌రెడ్డి కథకు శుభం కార్డు పడిందని.. త్వరలోనే బాబాయి హత్య సూత్రధారులు కూడా జైలుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి ఆళ్లగడ్డను దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదని లోకేశ్ ఆరోపించారు. ఇంటినే సెటిల్‌మెంట్ డెన్‌గా మార్చుకున్నారని.. దుయ్యబట్టారు. ఇసుక, మట్టి, కాంట్రాక్టులు, మద్యం, అక్రమ బియ్యం రవాణా.. ఇలా ప్రతి దాంట్లో లూటీ చేస్తూ.. 200 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడు రాఘవేంద్ర రెడ్డి.. ఎర్రమట్టి, ఇసుక, ఎర్రచందనం దోపిడీ, భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ.. ధ్వజమెత్తారు. ఆళ్లగడ్డను అభివృద్ధి చేసిన భూమా కుటుంబాన్ని జగన్ వేధిస్తున్నారని.. తల్లి, తండ్రి లేని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అఖిలప్రియ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు.
లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పూర్తై.. మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లాలోకి ప్రవేశించింది. ఏప్రిల్ 13న ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర.. 40 రోజుల పాటు సాగింది. 14 నియోజకవర్గాల్లోని 45 మండలాలు, 281 గ్రామాల మీదుగా 507 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో.. ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు, కార్యకర్తలు.. యువనేతకు వీడ్కోలు పలికారు. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడి మండలం సుద్దపల్లి వద్ద వైఎస్సార్ జిల్లాలోకి అడుగుపెట్టిన లోకేశ్‌కు.. పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలతో యువనేతను సత్కరించిన తెలుగుదేశం నాయకులు.. బాణాసంచా కాల్చి.. జిల్లాలోకి ఆహ్వానం పలికారు.
"బాబు గారు ప్రజలను నమ్ముకుంటే.. జగన్ రెండు వేల రూపాయల నోటును నమ్ముకున్నాడు. కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తే.. తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయింది. బాబు గారిది స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే.. జగన్‌ది అంధకారప్రదేశ్. బాబాయ్ హత్య కేసులో అబ్బాయి అడ్డంగా దొరికాడు. ఏం తప్పు చేయకపోతే ఎందుకు ఈ అబ్బాయి భయపడుతున్నాడు. కడప జిల్లాలో అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అక్కడకి తీసుకొనివెళ్లలేదు ఆ తల్లిని.. నాలుగు గంటలు ప్రయాణించి కర్నూలు జిల్లాలో.. గూగుల్‌లో 2.4 రేటింగ్ ఉన్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాడు. రాజకీయం కోసం.. తల్లిని కూడా విడిచిపెట్టడం లేదు ఈ దొంగ అబ్బాయిలు. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం.. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కూడా జైలుకు వెళ్లడం ఖాయం". - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: