MAHASHIVRATRI IN SRISAILAM: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో శనివారం నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో ఉత్సవాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నల్లమల్ల అడవుల గుండా పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శ్రీశైలంలో భక్తులందరికీ ఆలయ అధికారులు కావల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సులువుగా మల్లికార్జున స్వామి వారి అలంకార దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు.
భక్తులు రూ.500 అతి శీఘ్ర దర్శనం, రూ. 200 శీఘ్ర దర్శనం టిక్కెట్లు తీసుకొని దర్శనం చేసుకుంటున్నారు. అతి శీఘ్ర దర్శనం గంట సమయం ,శీఘ్ర దర్శనం రెండున్నర గంటల సమయం , ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులను శీఘ్ర దర్శనం క్యూ లైన్ లో దర్శనానికి అనుమతిస్తున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు బృంగి వాహన సేవ జరగనుంది. బృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
వాహనాలకు అటవీశాఖ అనుమతి: పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుండటంతో.. రద్దీని తట్టుకునేందుకు, ప్రకాశం జిల్లా డోర్నల నుంచి రాత్రిపూట కూడ వాహనాలు వెళ్లేందుకు.. అటవిశాఖ అనుమతి తీసుకున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల వరకే ఈ అనుమతి ఉంటుందని శ్రీశైలం అలయ అధికారులు వెల్లడించారు. వీరంతా నల్లమల అభయారణ్యంలో ప్రయాణించాల్సి ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటవిప్రాంతంలోనూ అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం, పోలీసులుఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దిగువ శ్రీశైలంగా పేరొందిన పెద్ద దోర్నాలలో నటరాజ్ కూడలి వద్ద ముఖ ద్వారాన్ని శ్రీశైలం దేవస్థానం అధికారులు విద్యుత్తు దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివ సదనంలో భక్తుల విడిది కోసం టెంట్లు ఏర్పాటుచేశారు. చలి వేంద్రాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు మధ్య శ్రీశైలం వెళ్లేందుకు వాహనాలకు అనుమతి ఉండేది కాదు. పెద్ద దోర్నాలలోనే నిలిచిపోయేవి. ఉత్సవాల వేళ అటవీశాఖ అనుమతి ఇవ్వడంతో నేరుగా వెళ్తున్నాయి.
ఇవీ చదవండి