Nandyala Police Solve Theft Case : ఓ తండ్రి తన కూతురిని పెళ్లిలో మహారాణిలా చూసుకోవాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడ్డారు. రూపాయి రూపాయి పోగు చేసి కొంత బంగారాన్ని కొన్నారు. కొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి అనగా బంగారం, నగదును ఇంట్లో పెట్టి తిరుమలకు వెళ్లాడు. అంతే అప్పటివరకూ గోతి కాడి నక్కలా ఉన్న డ్రైవర్ నగదు, బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.
అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మల్లు వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14 లక్షల రూపాయల నగదు, 63 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రఘువర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఆవుకు మండలం రామాపురానికి చెందిన మల్లు వెంకటేశ్వర రెడ్డి స్లాబ్ ఫ్యాక్టరీ యజమాని. ఈ నెల 1న కుటుంబ సభ్యులతో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆయన తిరుమలకు వెళ్లారు. తన కుమార్తె పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న 63 తులాల బంగారం వస్తువులు, 14 లక్షల రూపాయల నగదు ఇంట్లో బెడ్ రూమ్‌లోని బీరువాలో భద్రపరిచి వెళ్లారు. 2వ తేదీ తెల్లవారు జామున వారి ఇంటి తలుపులు తెరచి ఉండటం ఫ్యాక్టరీలో గుమస్తాగా పని చేస్తున్న వెంకటేశ్వర రెడ్డి గమనించాడు.
ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూంలో బీరువా పగుల కొట్టి వస్తువులు, చీరలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఈ విషయాన్ని యజమానికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే మల్లు వెంకటేశ్వర రెడ్డి ఇంటికి వచ్చి చూడగా బంగారం, నగదు అపహరణకు గురైందని గుర్తించి అవుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, బనగానపల్లి సీఐ, ఎస్సై జగదీశ్వర రెడ్డి, సిబ్బంది ప్రత్యేకంగా బృందగా ఏర్పడి దర్యాప్తు చేశారు.
మల్లు వెంకటేశ్వరెడ్డికి బొలెరో వాహనానికి అప్పుడప్పుడు డ్రైవర్‌గా పనిచేసే ఓబులాపురానికి చెందిన మేకల సూర్య చంద్రుడు తిరుమలకు వస్తానని చెప్పి,.. తీరా వెళ్లే సమయానికి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు విచారణలో తెలిపారు. సూర్య చంద్రుడిని విచారించగా అతను, అతని మిత్రులైన అవుకు వాసులు పోతుల రామాంజనేయులు, లంకెల వన్నప్పలు కలిసి చోరీకి పాల్పడినట్లు తేలింది. ముగ్గురినీ అరెస్టు చేసి వారి వద్ద ఉన్న నగదు, బంగారు వస్తువులను రికవరీ చేశారు. కేసును ఛేదించిన సీఐ సుబ్బరాయుడు, ఎస్సై జగదీశ్వరరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
ఇవీ చదవండి