Kottu Satyanarayana Present Ashada Saree to Goddess Bhramaramba: ఆషాఢ మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ సారె కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆషాఢ సారె(పట్టుచీర) సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ అమ్మవారికి ఆషాఢ సారెను ఆయన సమర్పించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆషాఢ మాసంలో అమ్మవారి అనుగ్రహం సిద్ధించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మహిళల కుటుంబాలు సుఖశాంతులతో జీవించాలని, వారికి శుభాశీస్సులు కలగాలని తమ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆషాఢ సారె కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి చెప్పారు.
శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం జరిగింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారి గర్భాలయంలో చిన్నపాటి గోడను నిర్మించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థానం ఈవో, చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళ వాయిద్యాలు మధ్య పాతాళా గంగ నుంచి కళశాలలో నదీ జలాలను ఆలయంలోకి తీసుకువచ్చారు.
మంగళ వాయిద్యాల మధ్య కలసి నదీ జలాలను తీసుకువచ్చి శ్రీ మల్లికార్జున స్వామికి మంత్రి కొట్టు సత్య నారాయణ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అభిషేకం నిర్వహించారు. భక్తులు సైతం కలశాలతో మల్లన్నకు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా వేదమంత్రోచ్ఛరణలతో మార్మోగింది. వేద పండితులు వేద పారాయణలు చేశారు. రాష్ట్రంలో సకాలంలో తగినన్ని వర్షాలు కురవాలని పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతో ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి విమర్శల వర్షం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శ్రీశైలం పర్యటనకు వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన మాటను నెరవేర్చలేదని మంత్రి విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా వారు ఆలోచించడం లేదని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. రాష్ట్రానికి నిధులు, పథకాలు ఇస్తామని, అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
'తొలి ఏకాదశి సందర్భంగా ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయాల్లో ప్రభుత్వం ఆషాఢ సారె సమర్పిస్తున్నాం. మొదటి సారెగా భ్రమరాంబ అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాం. ఆయా ప్రాంతాలలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆషాఢ సారె కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.'- కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి