IT raids at Mallareddy properties: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మంత్రి మల్లా రెడ్డి ఇంట్లో సోదాలు కలకలం రేపాయి. పదుల సంఖ్యలో ఐటీ బృందాలు ఒక్కసారిగా సోదాలు మొదలు పెట్టాయి. మంత్రి, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు.. ఇలా ఎవరినీ వదిలి పెట్టలేదు. ఈ సందర్భంగా అధికారులు పెద్దమొత్తంలో నగదు, దస్త్రాలు, ఆస్తిపాస్తుల వివరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సమీప బంధువు ఒకరు తలుపు తీసేందుకు నిరాకరించడంతో అధికారులు తాళాలు బద్దలు చేసుకొని మరీ లోనికి ప్రవేశించారు. మరోచోట లాకర్ తెరిచేందుకు నిరాకరించడంతో నిపుణులను పిలిపించి మరీ బలవంతంగా తెరిచి చూశారు. ఈలోపు మల్లారెడ్డి అనుచరులు ఆయన ఇంటికి చేరుకొని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. న్యూ బోయినపల్లి జయనగర్ కాలనీలోని మల్లారెడ్డి నివాసంలో నిన్న ఉదయం 6 గంటల నుంచే ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు.
బ్యాగ్‌లో లభించిన సెల్‌ఫోన్: ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి, సమీపంలోని సౌజన్య కాలనీలో నివాసముండే మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, సీతారాంపురంలో నివాసముండే వ్యాపార భాగస్వామి నర్సింహ యాదవ్, చిన్నతోకట్టలో నివాసముండే చిట్ ఫండ్ వ్యాపారి గంగాధర్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. విదేశీ పర్యటనలో ఉన్న మర్రి రాజశేఖర్రెడ్డి మినహా మంత్రి మల్లారెడ్డితో పాటు మిగతా వారంతా సోదాల సమయంలో ఇళ్లలోనే ఉన్నారు. తనిఖీల సందర్భంగా మంత్రి కార్యాలయం బాల్కానీలో లభించిన ఓ బ్యాగులో ఉన్న చరవాణిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ ఎవరిదన్న విషయంలో మంత్రిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ లభించడంతో మంత్రి ఇంటిపక్కనే నివాసముండే ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి నివాసంలో సోదాలు మరింత ముమ్మరం చేసి చివరికి చెత్తబుట్టలను సైతం వదలకుండా సోదాలు చేశారు. మంత్రి, ఆయన సోదరుడి ఇళ్లలోని లాకరు, అల్మారాలకు సంబంధించి తాళాలు అందుబాటులో లేవని తెలుసుకున్న అధికారులు సికింద్రాబాద్ నుంచి మారు తాళాలు.. తయారు చేసే వ్యక్తిని తీసుకొచ్చి వాటిని తెరిపించారు.
4 కోట్ల నగదు గుర్తింపు: సోదాలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు మంత్రి అనుచరులు మల్లారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి.. తన మద్దతుదారులతో పాటు మీడియా వైపు చూస్తూ విజయసంకేతం చూపించారు. ఇక మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులు విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయన కుమార్తె, మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రేయారెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన అధికారులు.. సుమారు 4 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు క్రాంతి కో-ఆపరేటివ్ ఆర్బన్ బ్యాంకు సంస్థల చైర్మన్ బి. రాజేశ్వరరావు గుప్తా ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
బాలానగర్ రాజు కాలనీలోని ఆయన నివాసానికి ఉదయాన్నే చేరుకున్న అధికారుల బృందం.. దస్త్రాలు పరిశీలించారు. క్రాంతి బ్యాంకు నుంచి స్థిరాస్తి వ్యాపారానికి నిధులు దారి మళ్లాయనేది అధికారులు అనుమానం. రాజేశ్వర రావు గుప్తా.. మల్లారెడ్డికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. దుండిగల్‌లోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డితో పాటు ఆయన సహచరులపై అధికారులు జరిపిన దాడుల్లో భాగంగానే రాజేశ్వరరావు గుప్తా నివాసంలోనూ నిర్వహించినట్లు సమాచారం.
మల్లారెడ్డి ఇద్దరు కుమారుల ఇళ్లల్లో ఐటీ దాడులు: కొంపల్లి పరిధిలోని ఫాం మెడోస్‌లో నివసిస్తున్న మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అక్కడికి సమీపంలోనే ఉంటున్న మరో కుమారుడు భద్రారెడ్డిల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మల్లారెడ్డి వైద్య కళాశాలకు భద్రారెడ్డి, ఇంజినీరింగ్ కళాశాలలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. మల్లారెడ్డి బంధువు, మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ త్రిశూల్ రెడ్డి.. జీడిమెట్లలోని బీమా ప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో కూడా అధికారులు సోదాలు జరిపారు. అక్కడ 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి సమీప బంధువు సంతోష్ రెడ్డి.. కొంపల్లిలో బొబ్బిలి ఎంపైర్ అపార్టుమెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఉదయం సోదాలకు వెళ్లిన అధికారులను గుర్తించిన సంతోష్ రెడ్డి కుటుంబసభ్యులు లోపలి నుంచి గడియ పెట్టుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా తీయలేదు.
అధికారులు తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించటంతో తలుపు తీశారు. దీంతో అధికారులు సోదాలు ప్రారంభించారు. మల్లారెడ్డి వైద్య కళాశాలల్లో మల్లారెడ్డికి చెందిన సూరారంలోని రెండు మల్లారెడ్డి వైద్య కళాశాలలు, రెండు దంత వైద్య కళాశాలలతో పాటు మల్లారెడ్డి, నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. అడ్మిన్ విభాగాల్లో ఆదాయపన్ను సంబంధించిన వివరాలతో పాటు మెడికల్ సీట్ల వ్యవహారంపైనా ఆరా తీసినట్లు సమాచారం.
కళాశాల డైరెక్టర్ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. మల్లారెడ్డి గ్రూపు కళాశాలల్లో.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంతో పాటు, మల్లారెడ్డి సీఎంఆర్ కళాశాలలో ఉదయం విద్యార్థులు చేరుకోక ముందే ఐటీ శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. కళాశాలల అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగం, ల్యాబ్‌లలో కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు పరిశీలించారు. మరికొన్ని రోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: