Fake votes Registration in Nandyala: ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో తీవ్ర నిర్లక్ష్యంతో చేపట్టడం విస్మయానికి గురి చేస్తోంది. వివిధ ప్రాంతాలు, ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసే ముందు ఆయా వివరాలను సరిచూసుకుంటారు. ఇక్కడ మాత్రం అధికారులు తనిఖీలు చేసినట్లు కనిపించడం లేదు. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్‌లో ఇంటి నంబరు 1-157-133 చిరునామా కింద 103 ఓట్లు ఉన్నట్లు చూపారు. వాస్తవానికి ఆ నంబరుతో అసలు ఇల్లే లేదు. దీన్ని బట్టి ఓటర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియ ఎంత అడ్డగోలుగా జరిగిందో అర్థమవుతోంది.
నేటికీ కొనసాగుతున్న ఓట్లు.. నందికొట్కూరు నియోజకవర్గంలోని.. 48 నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉంది. బైరెడ్డి రాజశేఖర్రెడ్డినగర్‌లో.. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి ఓట్లను కొనసాగిస్తున్నారు. బీఎల్‌వోలు ఉద్దేశపూర్వకంగానే ఆయా ఓట్లను తొలగించకుండా వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్‌లో ఓ ప్రాంతంలో బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వారిలో పలువురు చాలా ఏళ్ల కిందటే గుంతకల్లు, గుత్తి, బళ్లారి, ఆత్మకూరు, నంద్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయినప్పటికీ సుమారు 30మంది పేర్లు నేటికీ ఇక్కడ కొనసాగుతున్నాయి.
వేర్వేరు ఇంటి నెంబర్లలో భార్యభర్తల పేర్లు.. భార్యాభర్తల ఓట్లు వేర్వేరు ఇంటి నెంబర్లతో నమోదు కావడం.. చర్చనీయాంశంగా మారింది. ఇప్పే వెంకటేశ్, పద్మావతిలు దంపతులు. వీరిలో వెంకటేశ్ పేరు 1-157-119 ఇంటి నంబరులో ఉంటే భార్య పద్మావతి పేరు 1-317 ఇంటి నంబరులో ఉంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్‌లో గతంలో నివసించిన వారిలో పలువురు వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు కొత్త ఇళ్లు కట్టుకున్నారు. కొందరు చనిపోయారు. అయినా ఓటరు జాబితాల్లో మార్పు చేర్పులు చేయలేదు.
లేకపోయినా ఉన్నట్లే.. ఓటరు జాబితాలోని.. సీరియల్ నంబరు 111లో ఉన్న రామాంజనేయులు, 126లో ఉన్న సుంకమ్మలు భార్యాభర్తలు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. సీరియల్ నంబరు 110లో ఉన్న లక్ష్మన్న, 128లో ఉన్న కొండలమ్మలు భార్యాభర్తలు. వీరిద్దరు ప్రస్తుతం గుంతకల్లులో స్థిరపడ్డారు. వీరి ఓట్లు మాత్రం.. ఇంకా ఇక్కడి జాబితాలో కొనసాగుతున్నాయి. ఎల్లప్ప, చంద్రకళ ఇద్దరూ ప్రస్తుతం 1-159-2 ఇంటి నంబరులో నివసిస్తుండగా, ఓటరు జాబితాలో 1-157-113లో నివసిస్తున్నట్లు చూపారు. గతంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్‌లో ఉన్న ఎల్లమ్మ, బడేసాబ్ , శ్రీనివాసులు, రాముడు, సంజమ్మలు కొన్నేళ్ల కిందటే చనిపోయారు. అయినా వారి పేర్లను తొలగించకుండా ఉంచారు.