CM Jagan Tiruvuru Tour : గతేడాది అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. 9.86 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా 698.68 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జమ చేశారు. సభ కు పలు ప్రాంతాల నుంచి విద్యార్ధులను రప్పించారు.
కళాశాలల్లో సమస్యలపై యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు కోసం తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. తల్లులు ప్రతి మూడు నెలలకొకసారి కాలేజీలకు వెళ్లి, తమ పిల్లల బాగోగులు తెలుసుకుని స్వయంగా వాళ్లే ఫీజులు కట్టాలని సీఎం సూచించారు. మరో రెండు సంవత్సరాలు సమయం ఇస్తే.. ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవు అన్న మాటను తుడిచేస్తానన్నారు. రెండు సంవత్సరాలు టైం ఇస్తే.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా చేస్తానన్నారు. ఉన్నత విద్యలోనూ పలు మార్పులు చేసినట్లు తెలిపారు. మూడేళ్ల కోర్సులను నాలుగు సంవత్సరాలు చేశామని,ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తిరువూరు నియోజకవర్గంలో కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జికి 26 కోట్లు మంజూరు చేశారు. ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు కృష్ణా జలాలు మంచినీటి సరఫరా కోసం 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మరో 6 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల రిపేరు కోసం 10 కోట్లు,4 కోట్లు డ్రైనేజీ కోసం మంజూరు చేస్తున్నామన్నారు. తిరువూరు లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. సభావేదికగా ప్రతిపక్షాలపై సీఎం మరో సారి సవాళ్లు విసిరారు. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్న సీఎం... దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయాలని సీఎం మరో సారి సవాల్ చేశారు.
సభాస్థలి వద్ద ప్రజల అవస్థలు : ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజల వాహనాలను, బస్సులను తిరువూరుకు 3 కిలోమీటర్ల దూరంలో నిలిపివేశారు. దీంతో వారు కాలినడకన బయలుదేరి సభాస్థలికి చేరుకున్నారు. అంతకముందు తిరువూరులో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో సభా ప్రాంగణం మొత్తం తడిసి ముద్దైంది. వర్షం తెరిపించడంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :