YCP Leader Subba Rao Gupta on Chintamani Natakam: చింతామణి నాటకాన్ని 90 ఏళ్ల క్రితమే రాశారని ఒంగోలు వైకాపా నేత సుబ్బారావు గుప్తా అన్నారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. కాలేకూరి నారాయణ అద్భుతంగా రాశారని చెప్పారు. ఆర్యవైశ్యులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. నాటకంపై అత్యసరంగా జీవో తీసుకురావాల్సిన అవసరమేంటని..? నిలదీశారు.
"నాటకం నిషేధించవద్దని రఘురామ పిటిషన్ వేశారు. రఘురామపై నిరసనకు కుప్పం ప్రసాద్ పిలుపునిచ్చారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకుని ప్రసాద్ చెలామణి అవుతున్నారు. మంత్రి బాలినేని అనుచరులంతా ఇలానే ఉంటారు" - సుబ్బారావు గుప్తా, వైకాపా నేత
హైకోర్టులో రఘురామ పిటిషన్.. ఏముందంటే..
hc on Chintamani natakam : చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17 న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. దేవదాసి వ్యవస్థపై అవగాహన, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు . రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని పూర్తిగా నిషేధిస్తే వారు రోడ్డునపడతారని పేర్కొన్నారు. ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమానాలు ఇచ్చాయని గుర్తుచేశారు. కళాకారుడు స్థానం నరసింహారావును 1956లో కేంద్ర ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. న్యాయవిచారణ ముందు నిలువదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను రద్దు చేయాలని అభ్యర్థించారు.
"చింతామణి" నాటకంపై.. ప్రభుత్వ నిషేధం..!
Ban On Chintamani Natakam: ఈ తరానికి "చింతామణి" నాటకం గురించి పెద్దగా తెలియదుగానీ.. నిన్నటి తరానికి, గ్రామాల్లో ఉండే వారికి మాత్రం బాగా తెలుసు. "చింతామణి" నాటకం పేరు చెప్పగానే నవ్వులు విరబూస్తాయి. పల్లెల్లో అంతగా ప్రాచుర్యం పొందింది ఈ స్టేజీ నాటకం.అయితే.. ఈ నాటకంపై ఇటీవలి కాలంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. "చింతామణి" నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని చైతన్యం చేయడానికి బదులుగా.. వ్యసనాల వైపు మళ్లిస్తోందంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే.. ఈ నాటకాన్ని నిషేధించాలంటూ ఆర్య వైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధించింది.ఈ మేరకు జనవరి 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశించింది. ఈ నాటకంలోని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ.. ఆర్యవైశ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి:
Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ?: మంత్రి బాలినేని