రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి క్రమంగా తీవ్రమవుతోంది. నీటి లభ్యత తగ్గడం, సరఫరా వ్యవస్థలో లోపాల కారణంగా 30 పట్టణాల్లో మూడు రోజులకోసారి నీళ్లు సరఫరా చేస్తున్నారు. నెలాఖరు తర్వాత ఇలాంటి పట్టణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. పుర, నగరపాలక సంస్థల్లో చుట్టూ ఉన్న ప్రాంతాలను విలీనం చేస్తున్నా తాగునీటి సరఫరా వ్యవస్థను ఆయా ప్రాంతాలకు విస్తరించడం లేదు. శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లు కూడా తగినన్ని పంపని కారణంగా అరకొర నీటి సరఫరాతో ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, విజయనగరం నగర శివారు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
ఒంగోలు నగరంలోని అత్యధిక ప్రాంతాలకు రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. నగర విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నా అదే స్థాయిలో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగవడంలేదు. కొత్తగా వెలసిన ప్రాంతాలకు ట్యాంకర్లతో నీరు అందిస్తున్నారు. రెండు రోజులకోసారి వచ్చే ట్యాంకర్లలో నీటిని ప్రజలు డ్రమ్ముల్లో పట్టుకొని నిల్వ చేసుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు ప్రాంతమైన విజయనగర్ కాలనీలో రెండు, మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకరు నుంచి నీళ్లు పట్టుకోవడానికి ప్రజలు పడుతున్న అవస్థలివి. పట్టణంలోని అన్ని శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. పైపులైన్లలో లీకులు, తరచుగా తలెత్తే సాంకేతిక సమస్యలతో చాలా వార్డుల్లో నీరు సరిగా సరఫరా కావడం లేదు.
రోజూ 164 మిలియన్ లీటర్ల నీటి లోటు
వేసవి మొదలయ్యాక నీటి లభ్యత క్రమంగా తగ్గడంతో పట్టణాల్లో ప్రస్తుతం రోజూ 164 మిలియన్ లీటర్ల నీటి లోటు ఏర్పడింది. నెలాఖరుకు ఇది 200 మిలియన్ లీటర్లకు చేరుకోవచ్చని అంచనా. సాధారణ రోజుల్లో పుర, నగరపాలక సంస్థల్లో రోజూ 1,965 మిలియన్ లీటర్ల నీటిని ప్రజలకు సరఫరా చేస్తుండేవారు. భూగర్భ జలాలు అడుగంటడం, నదుల్లో, జలాశయాల్లోనూ నీటి లభ్యత తగ్గడంతో 1,801 మిలియన్ లీటర్లు అందిస్తున్నారు. బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లో పంపింగ్‌కి అంతరాయం ఏర్పడుతోంది. భూగర్భ జలాలు అందక 634 బోర్లను పూర్తిగా పక్కన పెట్టారు.
పైపులైన్లలో లీకేజీలు నిత్యకృత్యం
పట్టణాల్లో తాగునీటి పైపులైన్లలో లీకేజీలు నిత్యకృత్యమవుతున్నాయి. పాతవి కావడం, వీటి స్థానంలో కొత్త లైన్లు వేయని కారణంగా 60 పుర, నగరపాలక సంస్థల్లో ఇదే దుస్థితి. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఒకే రోజులో 100 నుంచి 130 చోట్ల పైపులైన్లలో లీకేజీలను గుర్తిస్తున్న సందర్భాలున్నాయి. తిరుపతి. ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లోనూ లీకేజీల సమస్య ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలో గతంలో లీకేజీ కారణంగా కలుషితమైన నీటిని తాగి ముగ్గురు మృతి చెందారు. పలువురు ఆసుపత్రుల్లో చేరారు.
రెండు రోజులకోసారి నీళ్లు సరఫరా చేస్తున్నవి ఇలా...
నగరపాలక సంస్థలు: కడప, ఒంగోలు, మచిలీపట్నం, తిరుపతి, విజయనగరం
పురపాలక, నగర పంచాయతీలు: బద్వేల్, బేతంచర్ల, బుచ్చిరెడ్డిపాలెం, చిలకలూరిపేట, బి.కొత్తకోట, ధర్మవరం, డోన్, గిద్దలూరు, గుత్తి, గూడూరు, హిందూపురం, కదిరి, మాచెర్ల, మదనపల్లె, మార్కాపురం, నందిగామ, నూజివీడు, పెడన, పెనుగొండ, పుంగనూరు, రాయచోటి, తాడిపత్రి, తిరువూరు, వినుకొండ, కమలాపురం, ఆత్మకూరు.
ఇదీ చదవండి: ఖాళీ బిందెలు పట్టుకొని.. నడి రోడ్డు మీద కూర్చొని..!