కర్ణాటకతోపాటు కృష్ణా పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 78,899 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 820.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 40.9904 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే పది రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆలమట్టిలోకి 27వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 46 వేల క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. నీటిమట్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, నారాయణపూర్-జూరాల మధ్య, భీమా నది ప్రాంతంలో కురిసే వర్షాలతో జూరాలకు ఎక్కువ ప్రవాహం ఉంది.
తొమ్మిది యూనిట్లతో విద్యుత్తు ఉత్పత్తి
కృష్ణానదికి వరద పెరగడంతో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ద్వారా కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో నాలుగు, దిగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో అయిదు యూనిట్ల ద్వారా ఉత్పత్తిని చేపట్టారు. ఒక్కో యూనిట్ ద్వారా గరిష్ఠంగా 39 నుంచి 40 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.
ఇదీ చదవండి: