కర్నూలు జిల్లాలో వినాయక చవితి సందడి మొదలైంది. మత విశ్వాసాలను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు ప్రకటించటంతో.. ప్రజలు విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. విగ్రహాలు కొనేందుకు ఎవరూ ముందుకురావటం లేదని మొన్నటివరకు తయారీదారులు ఆందోళన వ్యక్తం చేయగా.. విగ్రహాలు దొరకటం లేదని ప్రస్తుతం కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వినాయకచవితిని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. నగరం సహా జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేల విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. గతేడాది కరోనా కారణంగా పండగ కళ తప్పింది. ఈ ఏడాది సైతం కరోనా మూడోదశ కారణంగా ప్రభుత్వం ఆంక్షలు విధించటంతో... చాలా మంది విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు వెనకడుగు వేశారు. ఫలితంగా విగ్రహాల తయారీదారులు వ్యాపారాలు లేక, పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా రావా అన్న ఆందోళన వ్యక్తం చేశారు.
ఈనెల 8వ తేదీన హైకోర్టు వినాయక నవరాత్రుల విషయంపై స్పందించింది. ప్రైవేటు ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఒక్కసారిగా విగ్రహాల కొనుగోళ్ల కోసం బారులుతీరారు. పోటీపడి మరీ విగ్రహాలు కొనుగోళ్లు చేశారు. దీంతో విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ధర ఎక్కువ పెడతామన్నా వినాయకుల విగ్రహాలు లభించటం లేదు. మరికొందరు విగ్రహాల కోసం హైదరాబాద్ పయనమవుతున్నారు. ఒక్కరోజులోనే భారీ మార్పు రావటంతో తయారీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు తీర్పు ముందే వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని తయారీదారులు, కొనుగోలు దారులు అభిప్రాయపడుతున్నారు. చివరి నిముషంలో ఆదేశాలు రావటంతో ఏర్పాట్లకు సమయం సరిపోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: GOVERNOR, CM WISHES: 'ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలి'