కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బీ.నాగిరెడ్డిపల్లికి చెందిన లావణ్య నిండు గర్భిణీ. శుక్రవారం ఆమెను కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అయితే ఆమెకు ఫిట్స్ రావటంతో తీవ్ర అనారోగ్యానికి గురై కాన్పు జరగకుండానే మృతిచెందింది. కరోనా భయంతో శిశువును బయటకు తీసేందుకు వైద్యులు నిరాకరించారని బంధువులు తెలిపారు.
లావణ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. అయితే నిండు గర్భిణిని గ్రామంలో పూడ్చిపెడితే అరిష్టం జరుగుతుందంటూ దహన సంస్కారాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఏం చేయాలో పాలుపోని కుటుంబసభ్యులు మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టు కింద వదిలేశారు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు అంత్యక్రియలు నిర్వహించాలని లావణ్య బంధువులకు సూచించారు. ఈ కాలంలో మూఢనమ్మకాలను విశ్వసించి అంతిమ కార్యక్రమాన్ని గ్రామస్థులు అడ్డుకోవడం బాధాకరమని ఎస్సై అన్నారు.
ఇవీ చదవండి..