central minister Devsinh Chauhan press meet : 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి దేవ్‌సింహ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పూర్తిగా దివాలా తీసిందన్నారు. వలంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని వాసవీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఏపీలో భాజపా అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
మోదీ పాలనలో అద్భుతాలు... అంతకు ముందు కేంద్ర బడ్జెట్ పై మేధావులతో కర్నూలులో నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆర్టికల్ 370 తో జమ్మూకశ్మీర్ లో పరిస్థితి చక్కబడిందని చెప్పారు. గతంలో ఏదైనా జబ్బులకు వాక్సిన్ ఇతర దేశాల నుంచి వచ్చేదని గుర్తు చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ కృషి వల్ల కరోనాకు వ్యాక్సిన్ మనమే తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగామన్నారు. దేశంలో తొమ్మిదేళ్ల మోదీ పాలనలో అద్భుతాలు సృష్టించారని కేంద్రమంత్రి అన్నారు. సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని, ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి బీజేపి కృషి చేస్తోందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పేదల పేరుతో రాజకీయం చేసిందని విమర్శించారు. గ్రామంలో రోజువారి వేతనం రూ.16పైన ఉంటే దారిద్య్ర రేఖకు పైన ఉన్నట్లు పేదలను ఇబ్బంది పెట్టిందన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడని మంత్రులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు విట్టా రమేశ్, రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి :