కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో తుంగభద్ర దిగువ కాల్వలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. గుర్తు తెలియని వాహనంలో శవాన్ని తెచ్చి కాల్వలో పారేసినట్లు స్థానిక రైతులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన రైతులు కాల్వలో దిగి మహిళను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది.
కేసు నమోదు..
మృతురాలి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్వలో పడవేసినట్లు రైతులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ప్రమాదవశాత్తు సీలేరులో పడి..
సీలేరు నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మహిళ మృతి చెందింది. సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపునకు చెందిన వంతల దొయిమతి శుక్రవారం సాయంత్రం బట్టలు ఉతకడానికి సమీపంలోని సీలేరు నది వద్దకు వెళ్లింది. ఎంతసేపు అయినా ఇంటికి రాకపోయేసరికి భర్త వంతల ముకుందు నది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో బట్టలు మాత్రమే కనిపించాయి. దీంతో నది వెంబడి బంధువులతో గాలింపులు చేపట్టారు.
ఇన్‌టెక్ డ్యాం వద్ద..
శనివారం ఉదయం స్థానిక ఇన్‌టెక్ డ్యాం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు మృతదేహాన్ని దొయిమతిగా గుర్తించారు. మృతురాలి భర్త ముకుందు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేశారు. శవ పంచనామా అనంతరం మృతదేహానికి చింతపల్లి వైద్యాధికారి ఉమామహేశ్వరరావు పోస్ట్ మార్టమ్ నిర్వహించారు.
- తుమ్మలచెరువు రైల్వేస్టేషన్ పరిసరాల్లో..
పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు..
- రుణ భారంతో..
కర్నూలు జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట వద్ద గాలేరు-నగరి కాల్వలో పొద్దుటూరు పట్టణానికి చెందిన విష్ణువర్ధన్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం యానాది నగరకు చెందిన విష్ణువర్ధన్ పాణ్యం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.
భార్య ఫిర్యాదు మేరకు..
రెండు లక్షల రూపాయలు అప్పు ఉండడంతో మనస్తాపంతో కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ లింగమయ్య తెలిపారు.