పాఠశాలలో గది గోడ కూలి ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. 30 ఏళ్ల క్రితం స్థానికంగా నిర్మించిన ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు విద్యా బోధన జరుగుతోంది. ప్రస్తుతం 66 మంది చదువుతున్నారు. ఎనిమిది తరగతులకూ పాఠశాలలో రెండు తరగతి గదులే ఉన్నాయి. గదుల కొరత కారణంగా ఉపాధ్యాయులు శిథిలావస్థలో ఉన్న వరండాలోనే కొన్ని తరగతులకు విద్యాబోధన చేస్తున్నారు.
గురువారం ఉదయం రెండో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయురాలు వరండాలో పాఠాలు చెప్తుండగా, అకస్మాత్తుగా గోడ నుంచి భారీ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థులు అచ్చుగంట్ల సఫాన్, మహ్మద్ హారిఫ్ తలలకు తీవ్రగాయాలయ్యాయి. వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉపాధ్యాయులు చికిత్స చేయించారు. మండల విద్యాధికారి వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా ‘నాడు-నేడు’ కింద ఉర్దూ పాఠశాల ఎంపిక కాలేదన్నారు. పాఠశాల సమస్యలపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. .
Audio Viral: చెవిరెడ్డి పల్లెబాట విజయవంతానికి తంటాలు.. మహిళా సంఘాలకు బెదిరింపులు