TIPS FOR TENTH CLASS STUDENTS: మార్చి 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సమస్యలు, సందేహాలను పలువురు నివృత్తి చేశారు. ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి? మంచి మార్కులు సాధించాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
తెలుగులో 95కి పైగా మార్కులు సాధించొచ్చు: తెలుగు భాషపై పట్టు, పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఉంటే మంచి మార్కులు సాధించవచ్చని గుంటుపల్లి జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయిని ఎస్. శైలజ అన్నారు. అవగాహన- ప్రతిస్పందన విభాగం నుంచి ఎక్కువ మార్కులు సాధించవచ్చని తెలిపారు. పద్యభాగం నుంచి కవి పరిచయాలు, గద్యభాగం నుంచి కథానిక, వ్యాసం, నాటకం ప్రక్రియలు చదువుకోవాలని సూచించారు. రామాయణం నుంచి పాత్ర స్వభావం నేర్చుకోవాలని చెప్పారు. ‘ప్రత్యక్షదైవాలు’ పాఠాన్ని అవగాహన చేసుకుని చదవాలని, సృజనాత్మక ప్రశ్నకు మార్కులను సులభంగా పొందవచ్చని అన్నారు. వ్యాకరణాంశాలపై పట్టుసాధిస్తే తెలుగులో 95కి పైగా మార్కులు సాధించవచ్చని స్పష్టం చేశారు. వెనకబడిన విద్యార్థులు ఎస్సీఈఆర్టీ వారు అందించిన మోడల్ పేపర్స్ అభ్యాసన చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చక్కని చేతిరాతతోపాటు, అక్షరదోషాలు లేకుండా సమాధానాలు రాయాలని చెప్పారు.
హిందీలో ఈ అంశాలపై శ్రద్ధపెట్టాలి: హిందీలో అక్షరదోషాలు లేకుండా పదాలు రాస్తే మంచి మార్కులు వస్తాయని ఇబ్రహీంపట్నం జడ్పీహెచ్ స్కూల్ ఉపాధ్యాయుడు పి. సతీష్‌కుమార్ తెలిపారు. సఖీ, మనుష్యతా, కార్‌తూస్, కర్‌చలే హమ్‌ఫిదా, ఉపవాచకం నుంచి లఘుప్రశ్నలు వస్తాయని చెప్పారు. వ్యాకరణాంశాల్లోని ఉపసర్గ్, తత్సమ్-తద్భవ్, పర్వత్ ప్రదేశ్‌మీ పావస్, బడేభాయిసాహెతీ, డయిరీకా ఏక్ పన్నా బాగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. గద్యాంశంలో డైరీ ఎక్ పన్నా, తతారా వామీరో పాఠ్యాంశాలను బాగా చదవాలన్నారు. కవిపరిచయాల్లో మీరాభాయి, కబీర్‌దాస్ చదువుకుంటే సరిపోతుందని, వెనుకబడిన విద్యార్థులు కవిపరిచయం, లఘుప్రశ్నలకు జవాబులు, పేరాగ్రాఫ్, లేఖ అంశాలపై శ్రద్ధపెడితే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని సతీష్‌కుమార్ చెప్పారు.
ఇంగ్లిష్‌లో ఇలా సాధన చేస్తే చాలు: ఇంగ్లిష్‌లో ముఖ్యంగా గ్రామర్‌పై పట్టు సాధించాలని ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు ఎల్. పద్మజ సూచించారు. రీడింగ్ కాంప్రెహెన్షన్, వాయిస్, ఎడిటింగ్, ఆర్టికల్స్, రిపోర్టెడ్ స్పీచ్, కాన్వర్జేషన్‌లో ప్రశ్నలు పక్కాగా నేర్చుకోవాలని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రశ్నలు, పాసేజ్‌లను బాగా అర్థం చేసుకుని రాయాలని, స్టడీ స్కిల్స్, డేటా ట్రాన్స్‌ఫర్, డైరీ, లెటర్ రైటింగ్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని అన్నారు. రిపోర్టెడ్ స్పీచ్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే వెనకబడిన విద్యార్థులు సైతం ఉత్తీర్ణత మార్కులు సులభంగా సాధించవచ్చన్నారు.
టెన్షన్ వద్దు - పక్కా ప్రణాళికతో చదివితే పరీక్షలు పాస్
మ్యాథమెటిక్స్‌లో ఇవి తప్పనిసరి: మ్యాథమెటిక్స్‌లో రెండో అధ్యాయంలోని గ్రాఫ్ ప్రశ్నలు ఉంటాయని, సగటు, మధ్యగతం, బాహుళకంకు సంబంధించి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వస్తాయని గణిత ఉపాధ్యాయుడు ఆర్.ఎ. గణపతిరావు తెలిపారు. సంభావ్యత, నిరూప రేఖాగణితం, సాంఖ్యాకశాస్త్రం, వాస్తవసంఖ్యలు ఈ నాలుగు విభాగాలు చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చని చెప్పారు. 2, 4, 8, 10, 12 అధ్యాయాల నుంచి 2, 4 మార్కుల ప్రశ్నలు వస్తాయని, 3వ అధ్యాయం నుంచి వచ్చే గ్రాఫ్ ప్రశ్నను చేయగలిగితే సులభంగా 8 మార్కులు సాధించవచ్చని అన్నారు. ముఖ్యంగా ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన మూడు మోడల్ పేపర్లలోని అన్ని అంశాలు నేర్చుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చని సూచించారు.
బయోలాజీలో ఇవి పక్కాగా నేర్చుకోవాలి: మెదడు నిర్మాణం, అందులోని భాగాలు, విధులను పక్కాగా నేర్చుకోవాలని ఉపాధ్యాయురాలు ఎన్. అవని పేర్కొన్నారు. జీవక్రియలు, జీవుల ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అనే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయని తెలిపారు. నాడీ నియంత్రణకు, హార్మోన్ల నియంత్రణకు గల వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలని అన్నారు. పట్టికల కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం బాగా ప్రాక్టీస్ చేయాలన్నారు. వ్యాసరూప ప్రశ్నలకు బొమ్మలతో పాటు రాస్తే పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉందని, భేదాలు, నినాదాలు, ప్రశ్నలడగడం, పాటించవలసిన జాగ్రత్తలు మొదలైనవి సాధన చేయడం వల్ల వెనుకబడిన విద్యార్థులు సైతం మంచి మార్కులు సాధించవచ్చని సూచించారు.
ఫిజికల్ సైన్స్‌లో అలా చేస్తే టైమ్ వేస్ట్: ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, కాంతి పరావర్తనం, వక్రీభవనం పాఠ్యాంశాల నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయని ఉపాధ్యాయుడు యు. టైటస్ పాల్ తెలిపారు. విద్యుత్తు, రసాయన చర్యలు, సమీకరణాలు, అయస్కాంత ప్రభావాలు, లోహాలు, అలోహాలు వంటి అంశాలపై పట్టుసాధించాలన్నారు. వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు బొమ్మ గీసి వివరిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చని సూచించారు. ఒక మార్కుకు సంబంధించి జవాబు ఒక్క వాఖ్యంలో రాస్తే సరిపోతుందని, ఎక్కువగా రాయడం ద్వారా టైమ్ వేస్ట్ అవుతుందని చెప్పారు.
సోషల్ స్టడీస్‌లో 100% మార్కులు సాధించొచ్చు: సోషల్ స్టడీస్‌లో ముఖ్యంగా భౌగోళిక స్వరూపాలపై అవగాహన పెంచుకోవాలని ఉపాధ్యాయుడు బి. వెంకటేశ్వరరావు తెలిపారు. భారతదేశంతో పాటు ప్రపంచ మ్యాప్‌ని కూడా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులు బార్‌గ్రాఫ్స్, టేబుళ్లు, పై గ్రాఫ్, డయాగ్రమ్స్, ఛార్టులు బాగా సాధన చేస్తే ఉత్తీర్ణత సాధించవచ్చని అన్నారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసిన మోడల్ పేపర్, బ్లూప్రింట్‌లో చూపిన విధంగా 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఏ పాఠ్యాంశాల నుంచి ఇచ్చారో పబ్లిక్‌లోనూ అవే పాఠ్యాంశాల నుంచి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. జవాబులు పాయింట్లవారీగా రాయడంతో పాటు అందులో మ్యాటర్ ఉంటే 100% మార్కులు సాధించవచ్చన్నారు. పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశాలపై పట్టు సాధించాలని సూచించారు.
మార్చి 1 నుంచి ఇంటర్ - 17 నుంచి పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్ విడుదల
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు - హాల్‌టికెట్ ఇలా ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోండి