పన్నెండేళ్లకోమారు తరలివచ్చే సంబరం పుష్కర మహోత్సవం. ఈ సమయంలో నవ్య జలాలతో నదీ స్వరూపం మారిపోతుంది. అందులో సాన్నం చేసిన జనాల్లో ఏకాత్మీయత, సమైక్యత, సమరసత, సమాజహితం వంటి భావాలు వికసిస్తాయి. అవి జీవన లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదం చేస్తాయి. ‘పాషయతీతి పుష్కరం’ అంటారు. అంటే పోషించేది, పుష్టిని ఇచ్చేది పుష్కరం అని అర్థం. ఆ సమయంలో నదిలో మూడున్నర కోట్ల దేవతలు 12 రోజులు నదిలో ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే చాలామంది పుష్కర స్నానానికి తరలి వస్తుంటారు.
సముద్రంలో ఐక్యంకాని తుంగభద్ర
కృతయుగంలో భూదేవిని రక్షించేందుకు మహావిష్ణువు వరాహావతారం ఎత్తాడు. ఆయన రెండు కోరల నుంచి నదులు పుట్టాయని అవే తుంగ, భద్ర నదులని భాగవతం చెబుతోంది. ఈ నదులు కర్ణాటకలోని సహ్యాద్రి పర్వతాలతో రెండుగా పుట్టి, వేర్వేరు పాయలుగా ప్రవహించి శివమొగ్గ(కర్ణాటక) జిల్లాలో ఒక్కటై తుంగభద్రగా మారి బళ్లారి హగరిని తనలో కలుపుకొని కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మరో ఐదు నదులతో కలిసి కృష్ణమ్మతో సంగమిస్తాయి. 12 పుష్కర నదుల్లో తుంగభద్రకు ఓ విశేషం ఉంది. 11 నదులు సముద్రంలో కలుస్తుంటే, తుంగమ్మ మాత్రం నేరుగా సముద్రంలో కాకుండా కృష్ణానదిలో కలిసిపోతుంది. ప్రస్తుతం కొవిడ్‌తో ఈసారి పుష్కర స్నానానికి అనుమతి లేదు.
2008లో 18 ఘాట్లు
2008లో అప్పటి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. తుంగభద్ర తీరం వెంట మంత్రాలయం నుంచి కర్నూలు వరకు పుణ్యస్నానాల కోసం 18 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 25 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. రూ.22.92 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు.
ఇదీ చదవండి: జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ