Congress Party Six Principles Programme: 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ రాహుల్ గాంధీ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని దీంతో రాహుల్ గాంధీ పై ప్రజలకు మరింత సానుభూతి పెరిగిందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల కార్యక్రమం అమలు చేస్తామన్నారు. రైతులకు ఆరు లక్షల లోపు రుణాలు మాఫీ, 500 రూపాయలకు వంట గ్యాస్ అందించడం, పేదలకు నెలకు 6వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరచేతిలో కైలాసాన్ని చూపిస్తున్నారని ఆయన విమర్శించారు.
"దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. బీజేపీ రాజకీయ కక్షలు రోజురోజుకీ శ్రుతిమించుతున్నాయి. దానికి నిదర్శనమే రాహుల్ గాంధీ గారి ఉదంతం. ఒక చిన్న కారణాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారికి రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. దానిని సాకుగా చూపించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం.. దానిని సాకుగా చూపి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయించడం ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు. రాహుల్ గాంధీపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం.. ఏ భారతీయుడు అంగీకరించరు. ఏది ఏమైనా 2024లో చరిత్ర పునరావృతం అవుతుంది. బీజేపీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక తప్పదని.. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది.
ఈ సారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఒకటి.. రైతులకు సంబంధించి ఆరు లక్షల రూపాయల వరకూ వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తాం. రెండు.. మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ సరఫరా చేస్తాం. మూడవది.. పేదలకు సంబంధించి.. ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. నాలుగవది యువతకు సంబంధించి.. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం.. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం. అయిదవది వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీని ప్రకటించడం. ఆరవది.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొని.. అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తోంది". - తులసి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇవీ చదవండి: