Yuvagalam : తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావటమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం మహాపాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పుర్తి చేసుకుంది. ఈ సందర్భంగా... ఆదోని పట్టణం జనసంద్రమైంది. ప్రజలు భారీగా తరలి వచ్చి రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. యువనేతకు భారీగా పార్టీ శ్రేణులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్.. తన నడకను ముందుకు కొనసాగించారు. ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్ వద్ద పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీకారం చుట్టిన ఈ పాదయాత్ర ఉక్కుసంకల్పంతో అవిశ్రాంతంగా లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకునే లక్ష్యంతో ఇప్పటి వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి అనంతపురంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం పాదయాత్ర 77వరోజు ఆదోనిలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాలని తొలుత అనుకున్నా.. సగటున రోజుకు 13కిలోమీటర్లు మేర లోకేశ్ నడక సాగించారు.
అడుగడుగునా జన హారతి.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అడుగడుగునా వేలాది ప్రజలు యువనేతను కలిసి సమస్యలు చెప్తుండగా... మరికొందరు వినతిపత్రాల రూపంలో సమస్యలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటివరకు 1,300 వినతిపత్రాలు యువనేతకు అందాయి. యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు తాము ఏం చేస్తామనేది స్పష్టం చేస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు.
అడ్డుకులు సృష్టించిన ప్రభుత్వం.. పాదయాత్ర ప్రారంభం నుంచీ లోకేశ్‌కు అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు పోలీసులు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయిస్తూ వచ్చారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్‌తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. లోకేశ్‌తో పాటు అచ్చెన్నాయుడు, కుప్పం పీఎస్‌లో మనోహర్, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో సహా అనేక మంది తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు.
లక్ష్యం దిశగా ముందుకు.. యువగళం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాత్ర పూర్తయ్యే సమయంలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో పాటు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలు రెచ్చగొట్టినా ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా యువగళం లక్ష్యం దిశగా ముందుకు సాగింది. తన ప్రసంగాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను ప్రజల్లో ఎండగట్టడంలో లోకేశ్ పైచేయి సాధిస్తూ వచ్చారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని బయటపెడుతూ ఆధారాలివిగో అంటూ సవాళ్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏం చేస్తామో స్పష్టంగా చెప్తూనే.., వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
పరిశ్రమల వద్ద సెల్ఫీలు.. పాదయాత్రలో భాగంగా లోకేశ్ తమ హయాంలో తెచ్చిన పరిశ్రమల వద్ద సెల్ఫీలు దిగుతూ విసురుతున్న సవాళ్లు అధికార పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టాయి. కియా, డిక్సన్, టీసీఎల్, జోహా కంపెనీల వద్ద సెల్ఫీలు దిగి.. తన హయాంలో తెచ్చిన పరిశ్రమలు ఇవంటూ సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ మూసివేసిన అన్న క్యాంటీన్లు, దిశ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్రా పాయింట్ల వద్ద సెల్ఫీ దిగుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అక్రమాలంటూ పీఎల్ఆర్ కంపెనీకి చెందిన టిప్పర్లలో గ్రావెల్, ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న తీరును లోకేశ్ సెల్ఫీద్వారా బయటపెట్టారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం చెరువు, ఎర్రగుట్టలను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ వీడియోలను విడుదల చేశారు. అదే నియోజకవర్గం నుంచి పొరుగురాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుక లారీల వద్ద సెల్ఫీ దిగి అవినీతిని ఎండగట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు కర్నూలు జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మంత్రి గుమ్మనూరు జైరామ్లకు సంబంధించిన అవినీతి ఆధారాలంటూ లోకేశ్ పలు డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు.
సెల్ఫీ విత్ లోకేశ్‌కు విశేష ఆదరణ.. ప్రతిరోజూ ఉదయం అభిమానులతో నిర్వహిస్తున్న సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజు సగటున 1500 మంది వరకు కార్యకర్తలు, అభిమానులు యువనేతతో ఫోటోలు దిగుతున్నారు. అభిమానులు ఫోటోలు దిగిన తర్వాత ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా నేరుగా వారి వాట్సాప్‌కు ఫోటో చేరుతోంది. తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోల పట్ల అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.
ప్రతి 100 కిలో మీటర్లకు.. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ... తాము అధికారంలోకి వచ్చిన ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని లోకేశ్ ప్రకటిస్తున్నారు. పాదయాత్ర 8వరోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. బంగారుపాళ్యంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలఫలకాన్ని ఆవిష్కరించారు. 16వరోజు జీడి నెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో 200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 23వరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 300 కిలోమీటర్ల మైలురాయి దాటడంతో అక్కడ 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో చేపడతామని ప్రకటించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పాదయాత్ర 31వరోజు 400 కి.మీ మజిలీలో నేండ్రగుంటలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
39వరోజు మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 47వరోజు కదిరి నియోజకవర్గం చిన్నయ్యగారిపల్లి వద్ద 600 కి.మీ. మైలురాయి సందర్భంగా ఆ ప్రాంతంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు భరోసా ఇచ్చారు. 55వరోజు పెనుగొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల పూర్తికావటంతో గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హంద్రీనీవా కాల్వ నుంచి ఎత్తపోతల పథకం నిర్మిస్తామని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 63వరోజు 800 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు హామీ ప్రకటించారు.
70వరోజు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కి.మీ. మైలురాయి సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. తాజాగా 77వరోజు ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21ని దత్తత తీసుకుంటున్నట్లు లోకేశ్ ప్రకటించారు. కనీస మౌలిక వసతులు లేక దళితులు, బీసీలు, మైనార్టీలు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా చూశానన్న ఆయన.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డ్‌ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత తాను తీసుకుని తాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు.
యువగళం సైనికులకు అభినందన.. పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలిచిన యువగళం సైనికులను లోకేశ్ అభినందించారు. యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేశ్ నేతృత్వంలో 13కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీరితోపాటు 100మంది వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారు. 77రోజుల ప్రయాణంలో మూడు సార్లు తప్పని పరిస్థితుల్లో మాత్రమే పాదయాత్రకు సెలవులు ప్రకటించారు. తారకరత్న మరణం, ఎన్నికల కోడ్, ఉగాది సందర్భంలో మాత్రమే లోకేశ్ పాదయాత్రకు విరామం ఇచ్చారు.
కాళ్లకు బొబ్బలు వచ్చినా వాటిని సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. లోకేశ్ తీసుకునే ఆహారం, వ్యాయామం, నిద్ర సమయంపై తెలుగుదేశం నేతలు ఆచరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 6గంటలకే క్యాంప్ సైట్లో నిద్రలేవటం, బ్లాక్ కాఫీ, వ్యాయామం, దినపత్రికలు చదవటం తర్వాత ఆల్పాహారం తీసుకుని సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంతో పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం అయ్యాక లీటర్ నీరు, మధ్యాహ్నం ఓ సారి కొబ్బరినీళ్లు, భోజనంగా క్వినోవా విత్ వెజిటబుల్స్, అల్లం టీ తీసుకుంటున్నారు. సాయంత్రం మరో లీటరు మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు తీసుకుని పాదయాత్ర ముగిశాక రాత్రి భోజనం స్వల్పంగా తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి :