కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా సందర్భంగా రేపు కర్రల సమరాన్ని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఉత్సవంపై అధికారులు ఆంక్షలు విధించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కర్రల సమరంపై... పోలీసులు, అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి... హింసను అరికట్టాలని చేసిన ప్రయత్నాలు సత్పలితాలు ఇవ్వలేదు.
రెండు జట్లుగా ఏర్పడి..
జైత్రయాత్రగా బయలుదేరిన తమ ఇలవేల్పు మాళ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను స్వాధీనం చేసుకోవటానికి రెండు వర్గాల ప్రజలు పోటీ పడతారు. కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఇందులో పైచేయి సాధించిన వారు స్వామివార్లను తమ గ్రామానికి తీసుకువెళతారు. అందులో భాగంగానే... నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ప్రతియేటా ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు.
150 మందికి మాత్రమే అనుమతి..
కరోనా నేపథ్యంలో 18 గ్రామాల్లో అధికారులు, పోలీసులు అవగాహన కల్పించారు. ఒక్కో గ్రామం నుంచి 150 మందిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. బంధువులను ఎవరినీ గ్రామాలకు పిలవద్దని, వారిని దేవరగట్టుకు తీసుకురావద్దని హెచ్చరించారు. దీని వల్ల కరోనా నిబంధనలు పాటించటం సహా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాన్ని నిర్వహించవచ్చని... పోలీసులు భావిస్తున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఉత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారు. పోలీసులు ఇప్పటికే వెయ్యికి పైగా కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ సరఫరాపైనా బొగ్గు సంక్షోభ ప్రభావం.. ఈపీడీసీఎల్ పరిధిలో అనధికార కోతలు