విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం జిల్లా
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని డా.బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఐ గురుమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం... సామాన్యులకు ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తుందని విమర్శించారు.
కడప జిల్లాలో...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం.. కర్మాగారం ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా...
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయకూడదని కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా ధర్నా చేశారు.
విజయనగరం జిల్లా...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొబ్బిలిలో ప్రజా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దీనిని పరిరక్షించుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు దశలవారీగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాలూరు పట్టణం బోసుబొమ్మ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి నేషనల్ హైవే 26 పై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భోంజ్ దేవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: