ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 3,70,817క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 855.60 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 215.8 టీఎంసీలకుగాను ప్రస్తుతం 93.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25,427క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో.. రాయలసీమ నీటి పథకాలకు కృష్ణా జలాలు అందనున్నాయి. రేపట్నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.