కర్నూలు కార్పొరేషన్‌ను నాలుగో దఫా ఎవరు గెలుచుకోనున్నారనేది ఆసక్తి రేపుతోంది. కందవోలు నగరపాలక సంస్థగా 1994లో కీర్తి కిరీటం ధరించింది. 1995 తొలి ఎన్నికల్లో ఎస్సీ కోటా కింద బంగి అనంతయ్య మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండో దఫా ఎన్నికల్లో జనరల్‌కు సీటు కేటాయించగా, ఫిరోజ్ బేగం మేయర్‌గా 2000 సంవత్సరంలో ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఓసీ కోటాలో రఘునాథరెడ్డి(కాంగ్రెస్) మేయర్‌గా, అబ్ధుల్ రజాక్ ఉప మేయర్‌గా నిలిచారు. 2010తో వీరి పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికల జరగకపోవడంతో పాలక వర్గం లేక కార్పొరేషన్‌లో కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా వేధించాయి.
పదకొండేళ్ల తర్వాత ఎన్నికల పండగ జరగనుంది. ప్రస్తుతం నాలుగో దఫా ఎన్నికలకు కర్నూలును బీసీ(జనరల్)కు కేటాయించారు. మూడో విడత కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 29 గెల్చుకోగా, సీపీఎం 08, స్వతంత్రులు 08, తెదేపా 03, సీపీఐ, భాజపా చెరో ఒక్కోటి గెల్చుకున్నాయి. ప్రస్తుతం 52 డివిజన్లు అయ్యాయి. నగరంలో 33 వార్డులు, కల్లూరు పరిధిలో 16, కోడుమూరు పరిధిలో 03 నగరపాలక సంస్థ పరిధిలోకి చేరాయి. వీటిలో మొత్తం 4,48,774 మంది ఓటర్లు ఫలితాన్ని శాసించనున్నారు. గత మార్చి 23న జరగాల్సిన పుర పోరు కరోనాతో వాయిదా పడింది.
ఇదీ చదవండి: