కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలోని చింతకుంటలో గత నెల శ్రావణి, అంబటి సంజీవరెడ్డి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో నెల వ్యవధిలోనే ఇద్దరూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన ఘటనను వివరిస్తూ ఈటీవీ భారత్లో కథనం ప్రచురితమైంది.
దీనిపై స్పందించిన.. అమెరికాలోని లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ బృందం అనాథ పిల్లల నాన్నమ్మను ఈటీవీ భారత్ ద్వారా సంప్రదించారు. పిల్లలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ డైరెక్టర్లు పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి, సలహా మండలి సభ్యుడు రవికుమార్ నాయకత్వంలో చాలామంది ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. విరాళాల సేకరణ ద్వారా వచ్చిన మూడు లక్షల రూపాయల మొత్తాన్ని ఈ పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప సమక్షంలో చిన్నారుల నాన్నమ్మ వెంకట లక్ష్మమ్మ చేతుల మీదుగా ఒక్కొక్క చిన్నారికి లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల విలువైన చెక్కులను వారి ఖాతాలో జమ చేయించారు. చిన్నారులకు అండగా నిలిచిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ ప్రతినిధులను ఎస్పీ ప్రశంసించారు. పిల్లలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య