pregnants facings problems in hospital: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత యోజన కింద ఉచితంగా స్కానింగ్ పరీక్షలు చేస్తుంటారు. జిల్లాలోని వేలాది మంది నిరుపేద, మధ్య తరగతి గర్భిణులు.. పరీక్షల కోసం ఈ ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యాధికారులు కనీస వసతులు కల్పించకపోవటంతో నిండు గర్భిణులు సైతం నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3, 4 గంటల వరకు వారు నిలబడాలి.. లేదంటే నేలపైనే కూర్చొవాల్సిందే.
- స్కానింగ్ చేయించుకునేందుకు వచ్చినం. ఛైర్లు లేక కిందనే కూర్చున్నం. పొద్దున వచ్చినం. స్కానింగ్ అయ్యేసరికి సాయంత్రమైతదట. మాకు ఛైర్లు లేవు, ఫ్యాన్లు లేవు. చాలా ఉడుకుతుంది. - గర్భిణీ మహిళ
- బాగా ఇబ్బంది ఉంటుంది. మరి కింద కూర్చోబెడితే ఇబ్బంది కాదా..? స్కానింగ్ తీపిస్తం రమ్మన్నరు. నీళ్లు, తిండి లేకుండనే ఇక్కడ లైన్లో కూర్చుంటున్నం. - గర్భిణీ మహిళ
- స్కానింగ్ కోసం వచ్చినం. ఇక్కడ సీట్లు లేక కిందనే కూర్చున్నం. చాలా ఇబ్బందిగా ఉంది. 11 గంటల నుంచీ కూర్చున్నం. - గర్భిణీ మహిళ
ఆసుపత్రుల్లో ఫ్యాన్లు పని చేయటం లేదు. తాగునీటి సమస్య ఉంది. స్కానింగ్ కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు గర్భిణులు పరీక్షల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
వాళ్లే కింద కూర్చుంటరు..
ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రి అధికారులు మాత్రం అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామని చెబుతున్నారు. కుర్చీలు అందుబాటులో ఉన్నా మహిళలే కిందే కూర్చుంటారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి.. ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించాలని గర్భిణులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:
Lance Naik Sai Teja Death: నేడు స్వగ్రామానికి సాయితేజ మృతదేహం!