Bad Roads: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నుంచి సుంకేసులకు 26 కిలోమీటర్ల దూరం. ఈ మార్గం గుండానే మంత్రాలయం సహా తెలంగాణలోని ఎన్నో గ్రామాల ప్రజలు, కోడమూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు చెందినవారు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కూలి పనులకు వెళ్లేవారితోపాటు వైద్యం, చదువులు, నిత్యావసర సరుకుల కోసం వెళ్లే ప్రజలంతా.. ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తుంటారు. ద్విచక్ర వాహనం, ఆటో, బస్సు.. ఎందులో వెళ్లినా కేవలం అర గంటలో సుంకేసుల నుంచి కర్నూలుకు చేరుకోవచ్చు. కొన్నేళ్లుగా రోడ్డు అధ్వానంగా మారటంతో.. సుమారు 2 గంటలు ప్రయాణించాల్సి వస్తోంది.
అరకొరగా ఉన్న రోడ్డు.. వర్షాల కారణంగా మరింత దారుణంగా తయారైంది. రోడ్డు రూపురేఖలే మారిపోయాయి. భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. వీటిలో నీరు నిల్వ ఉండటంతో.. గుంత లోతును అంచనా వేయలేకపోతున్నారు. మరికొన్ని చోట్ల గుంతలను పూడ్చటానికి మట్టి పోయడంతో.. బురదగా మారి మరింత ప్రమాదరకంగా తయారైంది. ఇలాంటిచోట్ల ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు.
కర్నూలు నుంచి సుంకేసుల మార్గం నాలుగేళ్లుగా నకరం చూపిస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగవరం, నిడ్జూరు, కొంతలపాడు గ్రామాలు.. రోడ్డును ఆనుకునే ఉండటంతో ఇళ్లలోకి దుమ్ము చేరుతోంది. ఈ మార్గంలో ఇసుక లారీలు, టిప్పర్లు అధికంగా తిరుగుతుండటం.. సమస్య తీవ్రతను మరింత పెచింది. కర్నూలు నుంచి సుంకేసుల రహదారికి మరమ్మతులు చేయకపోతే.. ప్రయాణం చేయడమే కష్టమయ్యేలా ఉంది.