కర్నూలు జిల్లా బనగానపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా పనిచేసి ప్రస్తుతం అనంతపురం జిల్లా పంచాయతీ అధికారిని (డీపీవో) గా పనిచేస్తున్న పార్వతిపై బనగానపల్లెలో పోలీసులు కేసు నమోదు చేశారు. బనగానపల్లె మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారిణిగా 2018 ఆగస్టు 2 నుంచి 2019 జూన్ వరకు 11 నెలల పాటు ఆమె పని చేశారు. ఈ కాలంలో సుమారు 3 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే ఇందుకు సంబంధించి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజ శంకర్ ఈమెకు చార్జి మెమో కూడా జారీ చేశారు.
దీంతో పాటు నంద్యాల డీఎల్పీవో శ్రీనివాసులు.. ఈమె అక్రమాలకు పాల్పడినట్లు బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈమెపై ఐపీసీ 409 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక అధికారిగా ఉన్న సమయంలో ఈమె 163 /1 లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నలుగురికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. సుమారు కోటి రూపాయలకుపైగా ఎలాంటి రికార్డులు లేకుండా పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి ఆమె ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మొత్తం మీద సుమారు మూడు కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు కేబుల్ సంస్థలు రహదారులు గుంతలు తీసుకునేందుకు పంచాయతీ అధికారులకు ఇచ్చిన 5.80 లక్షల రూపాయలు ఆమె సొంత ఖాతాలో వేసుకుని డ్రా చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించి ఆమెపై కేసు నమోదు చేశామని ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు.
ఇదీ చదవండి: