కర్నూలు నగరంలో దుకాణ సముదాయాలకు వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేసి ఉండటం... కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు రాకపోకలతో ఆ మార్గంలో వెళ్లే సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. అబ్దుల్లాఖాన్ ఎస్టేట్, యూకాన్ ప్లాజా, భూపాల్ కాంప్లెక్స్, సెంట్రల్ ప్లాజా తదితర వాణిజ్య సముదాయాల వద్ద ఈ పరిస్థితి తలెత్తుతోంది. వీటిలో సెల్లార్లు ఉన్నా... వాటిని పార్కింగ్ కు కేటాయించకుండా అందులోనూ దుకాణాలను ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 100 పైగా ఇలాంటి వాణిజ్య సముదాయాలు ఉన్నా... వాటిపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు.
పార్కింగ్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున... గతంలో కర్నూలు నగరపాలక సంస్థ, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ, పోలీసులు సంయుక్తంగా... కొన్ని సముదాయాల్లో దుకాణాలు తొలగించారు. కొన్ని చోట్ల దుకాణాలు పడగొట్టి పార్కింగ్‌కు ర్యాంపులు వేశారు. మిగిలిన నేలమాళిగలు సైతం ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ హడావుడి కొన్ని రోజులకే పరిమితమైంది. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా... దుకాణాల తొలగింపు ఆగిపోయింది. మళ్లీ యథావిధిగా... దుకాణాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 19 సెంట్ల స్థలం సెల్లార్‌కు వదలాలి. ద్విచక్ర వాహనాలు, కార్లు తప్పనిసరిగా సెల్లార్లలోనే పార్కింగ్ చేయాలి. ఇవన్నీ పాటించకపోగా... వాణిజ్య సముదాయంలో 20 దుకాణాలు ఏర్పాటు చే... ఒక్కొక్కదానికి 20 వేల రూపాయల వరకు అద్దె వసూలు చేస్తూకోట్లాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి... అక్రమ దుకాణాలను తొలగించి... సెల్లార్లలోనే పార్కింగ్ వసతి కల్పిస్తే... సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఉండవని నగరవాసులు కోరుతున్నారు.