Chief Minister Chandrababu Naidu Delhi Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) సాయంత్రం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు.
శనివారం ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం దిల్లీ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో రెండు రోజులపాటు ఎన్‌డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.