పోతిరెడ్డిపాడు నుంచి దొంగతనంగా నీళ్లు తీసుకెళ్లి రాజశేఖర్ రెడ్డి నీటి దొంగైతే, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్టీఎస్ కుడికాలువ పనులతో ఆయన కుమారుడు జగన్ గజదొంగ అయ్యారని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ఆయన మాట్లాడారు. ఆంధ్ర అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరించనున్నారని తెలిపారు.
అడ్డుకునే ప్రయత్నం చేస్తాం..
రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువను ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని అడగనున్నారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఏపీ సీఎం జగన్ పనులు కొనసాగిస్తున్నారని.. ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని, అయినా వినకపోతే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతాం. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాయుద్ధానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి. -ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి
అన్యాయం జరిగితే ఊరుకోం..
తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేశారు. ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని తీరుతామని, జల వనరుల విషయంలో చుక్కనీరు నష్టపోకుండా ఎత్తుకు పైఎత్తు వేస్తామన్నారు. అక్రమ ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవాలో ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో పని చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్