‘నాలుగు ఖాళీ ట్రాక్టర్లు పట్టుకున్నారట.. వదిలేయండి. లేదంటే అధికారంలో ఉన్న మంత్రిని నేనే ధర్నాకు కూర్చుంటా. మంత్రి... గింత్రని ఏ మాత్రం ఆలోచించను. నాకు నా జనాలు కావాలి. ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాల్సింది నేను. ధర్నాకు నన్నే కూర్చునేలా చేస్తారో... లేక వదిలిపెడతారో చూసుకోండి’ అంటూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైతో చరవాణిలో మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రెండు, మూడు రోజుల క్రితం ఆస్పరి పరిధిలోని యాటకల్లు గ్రామానికి చెందిన సుమారు 40 మంది ట్రాక్టర్ల యజమానులు, కార్యకర్తలు ఆలూరులో మంత్రిని కలిశారు. పోలీసులు తమ ట్రాక్టర్లను పట్టుకున్న విషయాన్ని విన్నవించారు. దీంతో మంత్రి జయరాం నేరుగా ఆస్పరి ఎస్సైకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్‌లో పెట్టి ట్రాక్టర్ల యజమానుల ముందే మాట్లాడారు. అక్కడున్న కొందరు దీనిని చిత్రీకరించేందుకు ప్రయత్నించగా ఎక్కువ నిడివి తీయలేక మాటలు మాత్రం రికార్డు అయ్యాయి. ఇది సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఫోన్ సంభాషణలో ఆదోని ట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోలుతున్నాయని, ఆస్పరి వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఎస్సైని మంత్రి ప్రశ్నించారు. ‘ఇసుక ఉంటే విలేకరులెవ్వరూ చూడకపోతే వదిలిపెట్టి ఏదో యవ్వారం చేసుకోండి. మన తాలూకాలో ఎక్కడా బతకలేని పరిస్థితి’ అంటూ చరవాణి పెట్టేశారు.
'అసత్య ప్రచారాలు మానుకోవాలి '
బీసీ వర్గానికి చెందిన మంత్రినైన తనపై రెండు మీడియా ఛానెళ్లు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని మానుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టంచేశారు. ఇసుక ట్రాక్టర్ల విషయంపై వాట్సాప్ ద్వారా మీడియాకు ప్రకటన ఇచ్చారు. తాను ప్రాతినిథ్యం వహించే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ప్రభుత్వ గుర్తింపు పొందిన రీచ్‌లు లేనప్పుడు, ఇసుక అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మీడియాపై మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంపై కార్యకర్తలు, గ్రామస్థులు తన దృష్టికి తేవడంతో తాను ఎస్సైతో మాట్లాడిన మాట వరకూ వాస్తవమని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కర్నూలులో నకిలీ ఆయిల్, టీ పొడి తయారీ.. ముఠా అరెస్టు